North Korea : దూకుడు పెంచిన కిమ్‌

North Korea : దూకుడు పెంచిన కిమ్‌
ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాలలో పర్యటన

అగ్రరాజ్యం అమెరికా, దాయాది దక్షిణ కొరియాకు వరుస ఆయుధపరీక్షలతో నిద్ర లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా నియంత కిమ్‌ ఇప్పుడు దూకుడు పెంచారు. వరుసగా ఒకటి రెండు కాదు ఏకంగా 3రోజుపాటు ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాలలో ఆయన వివిధరకాల ఆయుధాల పనితీరును స్వయంగా పరిశీలించారు.

దేశం అంతా తిండి లేక తిప్పలు పడుతుంటే ఉత్తర కొరియా దేశ నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం క్షిపణి పరీక్షలు, సైనిక సమీక్షలతో క్షణం తీరికలేకుండా ఉన్నారు. దేశంలోని ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాల్లో పర్యటించి అక్కడి రైఫిళ్ల పనితీరును కిమ్‌ స్వయంగా పరిశీలించారు. ఆ ఫొటోలను ఉత్తర కొరియా అధికార మీడియా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఆయుధ శక్తిని మరింత పెంచాలని, సైనిక బలగాలకు సూచించినట్లు తెలిపింది.


ఇతర దేశాలతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఆయుధ ఫ్యాక్టరీల్లో నియంత పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యూహాత్మక క్రూయిజ్‌ క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రంతోపాటు ఇతర ఆయుధ ఫ్యాక్టరీలు, మానవరహిత గగనతల వాహనాలు, భారీ రాకెట్‌ లాంచర్లకు అవసరమైన పనిముట్ల తయారీ కేంద్రాలను అతను ఏకధాటిగా మూడురోజులు సందర్శించినట్లు సమాచారం. తమ శైలికి అనుగుణంగా వ్యూహాత్మక ఆయుధాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అత్యాధునిక సాంకేతికత కలిగిన ఇంజిన్లను రూపొందించాలని కిమ్‌ నిపుణులకు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు భారీదాడులకు ఉపయోగించే రాకెట్లను, అత్యాధునిక క్రూయిజ్‌ క్షిపణులతోపాటు ఇటీవల కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని కిమ్‌ పరిశీలించారు.

సాధారణంగా ఉత్తర కొరియా ఎక్కువ భాగం మిలిటరీ కోసమే ఖర్చు చేస్తుంది. గత ఫిబ్రవరి నెలలో కూడా తాజా క్షిపణి లాంచర్లను ఉత్తర కొరియా ప్రదర్శించింది. మిలిటరీ పరాక్రమాన్ని ప్రదర్శించడం, ప్రచారం కోసమే ఉత్తర కొరియా తన వనరులు అన్నింటినీ వినియోగిస్తుంది. గత ఏడాది కూడా ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అమెరికా భూభూగాన్ని చేరుకోగల సామర్థ్యం ఉన్న ఐసీబీఎంలు ఉన్నాయి. దీర్ఘకాలిక ఆహారకొరత ఆ దేశానికి ఇది మొదటిసారి కాదు. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో విధించిన సరిహద్దు నియంత్రణలు, దుర్భర వాతావరణ పరిస్థితులు, ఆంక్షలు అక్కడి పరిస్థితిని మరింత దిగజార్చాయి.

Tags

Read MoreRead Less
Next Story