మూడేళ్ల పోరాటం.. ఆమె గెలిచింది..

మూడేళ్ల పోరాటం.. ఆమె గెలిచింది..
పుట్టినప్పుడు ఫలానా అతడి బిడ్డగా, పెళ్లయ్యాక అతడి భార్యగా, వృద్ధురాలయ్యాక అతడి తల్లిగా.. జీవితం ఇలాగే ముగిసిపోతుంది.

ఏదైనా పోరాటంతోనే విజయం వరిస్తుంది. ఎప్పుడు ఆమె అతడి చాటునే ఉండిపోతుంది.. అతడి ద్వారానే గుర్తింపు పొందుతుంది.. ఈ వివక్ష మారాలి.. అందుకు పోరాటం చేయడానికి సంసిద్ధమైంది ఆఫ్ఘన్ మహిళ. పుట్టినప్పుడు ఫలానా అతడి బిడ్డగా, పెళ్లయ్యాక అతడి భార్యగా, వృద్ధురాలయ్యాక అతడి తల్లిగా.. జీవితం ఇలాగే ముగిసిపోతుంది. ఎక్కడా ఆమె స్వతంత్రురాలు కాదు.. ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలి అనుకున్నారు 25 ఏళ్ల ఆఫ్ఘన్ మహిళ లాలె ఉస్మాని.

2001లో తాలిబన్ల ఏలుబడిలో ఉన్న ఆఫ్టనిస్తాన్ స్త్రీల పరిస్థితి ఆ తరువాత ప్రభుత్వాలు మారినా మెరుగుపడలేదు.. స్త్రీలు తమ కనీస హక్కుల కోసం సుదీర్ఘ పోరాటాలు చేస్తూనే ఉంటారు. విద్యా హక్కు, ఓటు హక్కు, పని హక్కు వంటి వాటిపై విజయం సాధించినా స్త్రీల పరిస్థితి మరింత మెరుగు పడాలని యోచించారు ఉస్మాని.

మూడేళ్ల క్రితం హ్యాష్‌ట్యాగ్ వేర్ ఈజ్ మై నేమ్ కాంపెయిన్‌ను మొదలుపెట్టినప్పుడు అందర్నీ ఆలోచింపజేసింది. అంతర్జాతీయ వేదికలపై చర్చకు దారితీసింది. దేశం బయట స్థిరపడిన ఆఫ్ఘన్ ఆలోచనాపరులు ఈ కాంపెయిన్‌ను ముందుకు తీసుకెళ్లారు. స్త్రీల పేరు స్త్రీల హక్కు అని కాంపెయిన్ చెబుతుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డుల్లో తల్లి పేరు తప్పక ఉండాల్సిందేనని క్యాంపెయిన్ పట్టుబట్టింది. ఉస్మాని చేపట్టిన ఉద్యమం.. స్త్రీకి గుర్తింపు తేవాలన్న తన ఆలోచనలకు.. తోటి మహిళల నుంచి మద్దతు రాకపోగా చాలా మంది స్త్రీలు దీన్ని వ్యతిరేకించారు.

పైగా అసభ్యకరమైన వ్యాఖ్యానాలు చేశారు.. నీ పిల్లల గుర్తింపు కార్డులో నీ పేరు ఎందుకు ఉండాలనుకుంటున్నావో మాకు తెలుసులే.. ఆ పిల్లల తండ్రి ఎవరో నీక్కూడా తెలియదు కదా అని దారుణమైన కామెంట్లు చేశారు. గుర్తింపు కార్డుల్లో స్త్రీల పేర్లు వచ్చేలా జనాభా నమోదు చట్టం ను సవరణ చేయాలనే ప్రతిపాదనలు వచ్చినప్పుడు కూడా పార్లమెంటులో కొందరు సంప్రదాయవాదులు గట్టిగా వ్యతిరేకించారు. అయినప్పటికీ ఉస్మానీ వెనక్కి తగ్గలేదు. తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లింది. చివరకు దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘని వ్యతిరేతలు లెక్క చేయకుండా స్త్రీ పేర్లకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఇది స్త్రీలు సాధించిన ఒక పెద్ద ఘన విజయం. ఈ స్ఫూర్తితో మున్ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో స్త్రీల పురోభివ‌ృద్ధికి మరిన్ని బాటలు పడనున్నాయని ఆశించవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story