Pakistan: అఫ్గానీయులు పాక్ ను వదిలి వెళ్లిపోవాల్సిందే..

Pakistan: అఫ్గానీయులు పాక్ ను వదిలి  వెళ్లిపోవాల్సిందే..
డెడ్‌లైన్‌పై తేల్చి చెప్పిన పాక్‌

తమ దేశంలో అక్రమంగా ఉంటున్న అఫ్గాన్‌ పౌరులు నవంబరు ఒకటో తేదీలోపు దేశం విడిచివెళ్లాలనే గడువు పొడిగించే ప్రసక్తే లేదని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఐరాస ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఇస్లామాబాద్‌ మాత్రం తన నిర్ణయంలో మార్పు లేదని పేర్కొంది. 2021లో అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత లక్షల మంది పాకిస్థాన్‌కు శరణార్థులుగా వెళ్లారు. అయితే శరణార్థులుగా నమోదు చేసుకున్న 14లక్షల మందికి ఇబ్బంది లేదని పాక్‌ తెలిపింది. అక్రమంగా నివాసం ఉంటున్ 17లక్షల మంది తమ దేశం వీడాలని పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫరాజ్‌ ఇటీవల ప్రకటించారు. ఇప్పటివరకు 60వేల మందికిపైగా అఫ్గాన్లు స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ తాత్కాలిక ముఖ్యమంత్రి అజం ఖాన్ తెలిపారు. నవంబరు 1 తర్వాత పత్రాలు లేని వలసదారులందరినీ తొలగించే ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పాకిస్థాన్ కృతనిశ్చయంతో ఉందని మీడియాతో అన్నారు. అక్రమ వలసదారులను గుర్తించామని, వారి సమాచారం తమ వద్ద ఉందని వెల్లడించారు. స్వచ్ఛందంగా వెళ్లే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.


అక్రమ వలసదారులకు పాకిస్థాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. నవంబర్‌ 1లోగా దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని గురువారం అల్టిమేటమ్‌ జారీ చేసింది. లేనిపక్షంలో వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే అక్రమ వలసదారులకు షెల్టర్‌ ఇచ్చిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొంది. ఆ దేశ తాత్కాలిక అంతర్గత మంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు ప్రకటించింది. బలూచిస్థాన్‌లో 3 నిర్భంద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ప్రతినిధి జన్ అచక్జాయ్ వెల్లడించారు. అటు.. తమ ప్రాంతంలో కూడా 3 నిర్భంద కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ తాత్కాలిక ముఖ్యమంత్రి అజం ఖాన్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటినుంచి దాదాపు 60 వేల మందికి పైగా ఆఫ్ఘన్ వాసులు స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు అజం ఖాన్ తెలిపారు.


2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో తాలిబన్ల గత చరిత్ర గురించి తెలిసిన ఆఫ్ఘన్ వాసులు లక్షలాది మంది స్వదేశాన్ని వదిలిపెట్టి ప్రపంచ దేశాలకు పారిపోయారు. ఈ క్రమంలోనే లక్షలాది మంది ఆఫ్ఘన్ పౌరులు తమ దేశానికి పక్కనే ఉన్న పాకిస్థాన్‌లోకి ప్రవేశించినట్లు పాక్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు 13 లక్షల మంది ఆఫ్ఘన్ పౌరులు శరణార్థులుగా నమోదు చేసుకున్నారని.. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫరాజ్‌ బుగ్తీ ఇటీవల పేర్కొన్నారు. వీరికి అదనంగా మరో 17 లక్షల మంది అక్రమంగా పాకిస్థాన్‌లోకి దేశంలోకి చొరబడ్డారని ఆరోపించారు.


Tags

Read MoreRead Less
Next Story