Russia: కుప్పకూలిన రష్యా ల్యాండర్‌

Russia: కుప్పకూలిన రష్యా ల్యాండర్‌
జాబిల్లిపై పరిశోధనల్లో రష్యాకు దిమ్మతిరిగే షాక్‌ …. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టాలన్న మాస్కో ఆశలపై నీళ్లు...

ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడిపై రష్యా (Russia) చేపట్టిన ప్రయోగం విఫలమైంది. జాబిల్లిపై పరిశోధనల్లో రష్యాకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టాలన్న తొలి దేశంగా దిగాలన్న రష్యా ఆశలు.. అడియాసలు అయ్యాయి. చందమామ దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టడానికి ముందే కుప్పకూలింది. ల్యాండింగ్ కు ముందు ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్ కు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఫలితంగా నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్ కాస్మోస్ తెలిపింది.


ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన లూనా-25వ్యోమనౌక గింగిరాలు కొడుతూ చంద్రుడిపై క్రాష్ లాండ్ అయినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. లూనా-25ని ఈ నెల 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి ప్రయోగించగా నిర్దేశిత గడువు ప్రకారం సోమవారం చంద్రుడిపై అడుగు పెట్టాల్సి ఉంది. ఈలోపే క్రాష్ లాండ్ అయిపోయింది.


జాబిల్లి దక్షిణ ధ్రువంలో(Moon's south pole position) ల్యాండర్‌ను దించడమే లక్ష్యంగా లునా - 25‍ (Russia's Luna-25‌) ఈ నెల 11న జాబిల్లి దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌(Russia's space agency Roscosmos ) దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మాస్కోకు తూర్పున 3 వేల 450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ అనే ప్రాంతం నుంచి తెల్లవారుజామున 2.10 గంటలకు ‘లునా - 25’ నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం ఐదు రోజుల్లోనే లూనా 25 చంద్రుడి కక్ష్యలోకి చేరింది. ఆ తర్వాత జాబిల్లిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను దిగేలా మాస్కో ప్రయోగం చేపట్టగా అది విఫలమైంది.


ఇస్రో నిర్ణయించుకున్న ఆగస్టు 23 తేదీ లేదా అంతకంటే ముందుగానే చంద్రుని దక్షిణ ధ్రువంపై రష్యా ల్యాండర్‌ను దించేందుకు రష్యా ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ అది విఫలమైంది. ఇక.... చంద్రయాన్-3(Chandrayaan-3) ఆగస్టు 23 సాయంత్రం 5 గం టల 47 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. చంద్రయాన్‌-3 మాదిరి కాకుండా ఇది కేవలం ల్యాండర్‌ మిషన్‌ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story