US lunar lander: ఏళ్ల తర్వాత.. జాబిల్లిపైకి అమెరికా ల్యాండర్‌..

US lunar lander:  ఏళ్ల తర్వాత.. జాబిల్లిపైకి అమెరికా ల్యాండర్‌..
50 ఏళ్ల తర్వాత అమెరికా చంద్రునిపైకి తొలి లూనార్ ప్రయోగం

దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా జాబిల్లిపైకి మరో ల్యాండర్‌ను పంపింది. ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీస్‌ అనే ప్రైవేటు సంస్థ రూపొందించిన పెరిగ్రీన్‌ ల్యాండర్‌ను స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి యునైటెడ్‌ లాంచ్‌ అలయన్స్‌కు చెందిన ‘వల్కన్‌’ రాకెట్‌ ఈ ల్యాండర్‌ను తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. అన్నీ సజావుగా సాగితే ఫిబ్రవరి 23న ఈ లూనార్‌ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై దిగనుంది.

అంతరిక్ష రేసులో ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే దిశగా నాసా కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సొంతంగా లూనార్‌ ల్యాండర్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఇటీవల రెండు కంపెనీలకు కాంట్రాక్టులిచ్చింది. పెరిగ్రీన్‌ ల్యాండర్‌ కోసం 108 మిలియన్‌ డాలర్లకు ఆస్ట్రోబోటిక్‌తో కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది. తాజాగా ప్రయోగించిన పెరిగ్రీన్‌ ల్యాండర్‌ పలు సైంటిఫిక్‌ పరికరాలను మోసుకెళ్లింది. ఈ సైంటిఫిక్‌ పరికరాలు జాబిల్లి ఉపరితలంపై అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని నాసాకు పంపించనున్నాయి.

పెరిగ్రీన్‌ మోసుకెళ్లిన సైంటిఫిక్‌ పరికరాలు చంద్రుడిపై చేసే అధ్యయనం ఈ ఏడాది చివర్లో చందమామపైకి నాసా చేపట్టబోయే మానవసహిత ప్రయోగానికి ఎంతో కీలకం కానున్నది. ఈ ఏడాది ఆఖర్లో ఆర్టెమిస్‌-2 పేరుతో నాసా చంద్రుడిపైకి నలుగురు వ్యోమగాములను పంపనుంది. అందుకు సంబంధించిన సన్నాహకాల్లో భాగంగానే ఇవాళ పెరిగ్రీన్‌ ల్యాండర్‌ను ప్రయోగించింది.

కాగా, 1969లో అపోలో 11 రాకెట్‌లో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బుజ్‌ ఆల్డ్రిన్‌, మైఖేల్‌ కాలిన్స్‌ జాబిల్లికిపైకి వెళ్లారు. చంద్రుడిపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కూడా 1972 వరకు కూడా నాసా ఆరుసార్లు మానవసహిత జాబిల్లి యాత్రలు నిర్వహించింది. పలుమార్లు మెషిన్‌ ల్యాండర్లను ప్రయోగించింది. ఇప్పుడు ఆర్టెమిస్‌-2 ప్రయోగంతో మరో నలుగురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నది.

ఇదిలావుంటే చంద్రుడిపై అడుగుపెట్టే తొలి ప్రైవేటు కంపెనీగా అవతరించాలని పెరిగ్రీన్‌ను రూపొందించిన ఆస్ట్రోబోటిక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అంతకంటే ముందుగానే మరో కంపెనీ ఈ ఘనత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ కంపెనీ త్వరలోనే ల్యాండర్‌ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీన్ని చంద్రుడిపైకి నేరుగా వెళ్లే మార్గంలో పంపించనున్నారు. తాజాగా ప్రయోగించిన పెరిగ్రీన్‌ మాత్రం కక్ష్యలన్నీ తిరుగుతూ జాబిల్లిని చేరనుంది. ఇంట్యూటివ్‌ మెషిన్స్‌ తయారు చేసిన నోవా-సి ల్యాండర్‌ను ఫిబ్రవరి ఆరంభంలో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ తీసుకెళ్లనుంది. వారం రోజుల్లోనే చంద్రుడిపై అడుగుపెట్టేలా దాన్ని ప్రయోగించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story