Malala Yousafzai: హ్యాపీ బర్త్‌ డే... మలాల

Malala Yousafzai: హ్యాపీ బర్త్‌ డే... మలాల
26వ పడిలోకి అడుగుబెట్టిన మలాలా యూసఫ్‌జాయ్‌... ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంకా చోప్రా

నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా మలాలా యూసఫ్‌జాయ్‌(Malala Yousafzai) 26వ పడిలోకి అడుగుపెట్టారు. బాలికా విద్య కోసం పోరాడుతున్న ఆమె జన్మదినం సందర్భంగా (Malala's birthday) సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మలాల భర్త అస్సర్ మాలిక్(Malala Yousafzai's husband) ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే మలాలా...నేను ఆశించిన ఉత్తమ భాగస్వామి మీరే అంటూ అస్సర్‌ ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేశారు. మలాలా స్నేహితురాలు, నటి ప్రియాంక చోప్రా‍(Priyanka Chopra) కూడా ఈ హక్కుల కార్యకర్తకు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండాలంటూ ప్రియాంక ఇన్‌ స్టాలో పోస్ట్ చేశారు. తన పుట్టినరోజును నైజీరియా అమ్మాయిలతో జరుపుకుంటున్నట్లు మలాలా ఇన్ స్టాలో పోస్ట్‌ చేశారు. పదేళ్ల క్రితం నుంచి తాను ఇలా అమ్మాయిల మధ్య బర్త్‌ డే జరుపుకుంటున్నట్లు ఆమె తెలిపారు.


పాకిస్థాన్‌లోని స్వాత్‌ లోయలో జన్మించిన మలాలా బాలికల విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో తాలిబన్లు పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులకు దిగారు. మలాలా ఎడమ కణతిపై, శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆమెను వెంటనే పెషావర్‌కు తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. అయితే బుల్లెట్‌ గాయాలకారణంగా ఉత్తమ చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తర్వాత మలాలా కోలుకున్నారు. అనంతరం బ్రిటన్‌లోనే తల్లిదండ్రులతో కలిసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఘటన తరువాత ఆమె తండ్రికి బ్రిటన్‌లోని పాక్ ఎంబసీలో ఉద్యోగం కూడా ఇచ్చారు.


అప్పటి నుంచి మలాలా బాలికల విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. మలాలా ఫండ్‌ పేరుతో బాలికల విద్యకోసం ఛారిటీ సంస్థను నెలకొల్పారు. ఈ క్రమంలో తన సేవలను గుర్తించిన నోబెల్‌ కమిటీ 2014లో మలాలాకు నోబెల్‌ శాంతి బహుమతిని అందించింది. దీంతో 17 ఏళ్ల అతిపిన్న వయస్కురాలిగా నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మాలాలా వార్తల్లో నిలిచారు. 2020లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.


మలాలా తన స్నేహితుడు అసర్‌ను బ్రిటన్‌లో వివాహం చేసుకున్నారు. గతంలో మలాలా వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పెళ్లి అనవసరమని మలాలా అన్నారు. ఎందుకు పెళ్లి చేసుకుంటారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. జీవిత భాగస్వామి కావాలంటే, మీరు వివాహ పత్రాలపై ఎందుకు సంతకం చేస్తారని ప్రశ్నిస్తూ మలాలా చేసిన ప్రకటనపై ఆమె తండ్రి జియావుద్దీన్ యూసఫ్‌జాయ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story