Maldives: భారీగా తగ్గిన మాల్దీవుల టూర్ ప్యాకేజీ ధరలు

Maldives:  భారీగా తగ్గిన మాల్దీవుల టూర్ ప్యాకేజీ ధరలు
భారత్ తో దౌత్య వివాదమే కారణం

భారత్‌తో నెలకొన్న వివాదం మాల్దీవుల పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆ దేశం పర్యటించే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. భవిష్యత్తులో మాల్దీవులకు భారత్‌ నుంచి బుకింగ్‌లు భారీగా పడిపోయే అవకాశం ఉందని ఆ దేశం ఆందోళన చెందుతోంది. మాల్దీవుల జీడీపీలో మూడింట రెండో వంతు ఆదాయం పర్యాటక రంగం నుంచే లభిస్తుండగా...... భారత్‌తో వివాదం తమకు చేటు తెస్తుందని ఆ దేశ టూర్‌ ఆపరేటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారతీయులను సోదర సోదరీమణులుగా పేర్కొంటూ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు.

ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటన, అనంతరం మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాల్దీవుల పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపడం ఆరంభమైంది. బాయ్‌కాట్‌ మాల్దీవులు అని సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతున్న వేళ భారత్‌ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2023లో 2 లక్షల 9 వేల 198 మంది భారతీయులు మాల్దీవులు సందర్శించారు. అంటే రోజుకు సగటున 572 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గత ఏడాది మాల్దీవులను సందర్శించిన విదేశీయుల్లో భారతీయులదే అగ్రస్థానం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. భారత్‌తో వివాదం నెలకొన్న తర్వాత ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య రోజుకు 400కి పడిపోయింది. పలువురు భారత పౌరులు మాల్దీవులకు హోటల్‌, విమానాల బుకింగ్‌లను ఇప్పటికే రద్దు చేసుకున్నారు. ఐతే నెలల క్రితం మాల్దీవులకు టికెట్లు బుక్‌ చేసుకున్న వారు మాత్రం వాటిని రద్దు చేసుకుని డబ్బు వదులుకోలేక మాల్దీవులు పర్యటిస్తున్నారు. ఈ ఏడాది మాల్దీవులను సందర్శించిన విదేశీయుల సంఖ్యలో భారత్‌ నాలుగో స్థానానికి పడిపోయింది. రష్యా, ఇటలీ, బ్రిటన్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.


మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటంతో అక్కడి టూరిజం ఆపరేటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బుక్‌ చేసుకున్న వారు డబ్బు వదులుకోలేక ప్రస్తుతం మాల్దీవుల్లో పర్యటిస్తున్నప్పటికీ ఇకపై భారత్‌ నుంచి కొత్త బుకింగ్‌లు రావడం బాగా తగ్గిపోవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈజ్‌మైట్రిప్‌ వంటి భారత ట్రావెల్‌ సంస్థలు మాల్దీవులుకు బుకింగ్‌లను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల పర్యాటక రంగం నష్టనివారణ చర్యలు చేపట్టింది. మాల్దీవులు ట్రావెల్ ఏజెంట్స్, టూర్ ఆపరేటర్ల సంఘం మటాటో.. భారత ప్రజలకు విజ్ఞప్తులు చేసింది. మాల్దీవులకు బుకింగ్‌లను పునఃప్రారంభించాలని భారత్‌కు చెందిన ట్రావెల్‌ అగ్రిగేటర్‌ ఈజ్‌మై ట్రిప్‌ను కోరింది. తమ దేశ డిప్యూటీ మంత్రులు చేసిన విచారకర వ్యాఖ్యలను పట్టించుకోవద్దనీ.. అవి మాల్దీవుల పౌరుల మనోభావాలను ఏమాత్రం ప్రతిబింబించవని మటాటో వివరించింది. భారతీయులను తమ ప్రియమైన సోదర సోదరీమణులుగా భావిస్తామనీ రాజకీయాలకు అతీతంగా ఇరుదేశాలను కలిపే బంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరింది. మాల్దీవులు, భారత్‌కు మధ్య శాశ్వతమైత్రి బంధం ఉందని పేర్కొంది. తమ దేశ జీడీపీలో మూడింట రెండో వంతు పర్యాటకం నుంచే లభిస్తోందనీ 44వేలమంది ఆ రంగంపై ఆధారపడ్డారనీ ప్రస్తుత పరిస్థితి తమ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వివరించింది. ఇప్పటికే మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ -మటీ కూడా మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించింది. భారత్‌ తమను ఎన్నో సంక్షోభాల నుంచి ఆదుకుందని గుర్తు చేసుకుంది

Tags

Read MoreRead Less
Next Story