MERS-Coronavirus : అబుదాబీలో మెర్స్ కరోనావైరస్

MERS-Coronavirus : అబుదాబీలో మెర్స్ కరోనావైరస్
ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ

ప్రాణాంతకమైన మెర్స్ కరోనా వైరస్ పాజిటివ్ కేసు తాజాగా అబుదాబీలో వెలుగుచూసింది. ఒమన్ సరిహద్దులోని అబుదాబిలోని ఒక నగరంలో 28 ఏళ్ల యువకుడికి ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అల్ ఐన్ నగరానికి చెందిన ఓ వ్యక్తి మెర్స్ కరోనా వైరస్ వ్యాధితో గత నెలలో ఆసుపత్రిలో చేరినట్లు డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది.

రోగికి కాంటాక్ట్‌లో ఉన్న 108 మందిని ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఇప్పటివరకు సెకండరీ ఇన్‌ఫెక్షన్లు ఏవీ రాలేదని ఆ పరీక్షల్లో వెల్లడైంది. జ్వరం, దగ్గు, శ్వాస ఆడక పోవడం మెర్స్ కొవిడ్ రోగి లక్షణం. ఈ వ్యాధి కొన్ని సందర్భాల్లో న్యుమోనియాకు దారి తీయవచ్చునని వైద్యనిపుణులు చెప్పారు.

నిజానికి ప్రకృతిలో కోట్లాది రకాల వైరస్‌లు ఉన్నాయి. కానీ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు సుమారు 5,000 రకాల వైరస్‌లను గురించి వివరంగా తెలుసుకోగలిగారు. వైరస్‌లు మనుషులకే కాదు,పక్షులకూ, ఇతర జంతువులకూ, మొక్కలకూ, బాక్టీరియా వంటి సూక్ష్మక్రిములకు కూడా సోకుతాయి. పక్షులకు, జంతువులకు సోకిన వైరస్‌లు వాటిలో మ్యుటేట్‌ అయ్యి కొత్త వైరస్‌లుగా మారి మనుషులకు కూడా వ్యాపిస్తాయి. ఉదాహరణకు పక్షుల్లో వ్యాపించిన ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ మ్యుటేట్‌ అయ్యి హెచ్‌5 ఎన్‌1 రూపంలో మనుషులకు వ్యాపించింది. అదే బర్డ్‌ ఫ్లూ. అలాగే పందుల్లో వచ్చే ఇన్‌ఫ్లూయంజా వ్యాధి హెన్‌1 ఎన్‌1 రూపంలో మనుషులకు సోకింది అది స్వైన్‌ ఫ్లూ. అయితే మొక్కల్లో వచ్చే వైరస్‌ వ్యాధులు మనుషులకు సంక్రమించవు.


నిజానికి కరోనా వైరస్‌లు చాలా రకాలున్నాయి. మనుషుల్లో వ్యాపించే కరోనా రకాలు మాత్రం 229ఇ, ఎన్‌ఎల్‌63, ఒసి43, హెచ్‌కెయు1, మెర్స్‌-కోవ్‌, సార్స్‌-కోవ్‌, సార్స్‌-కోవ్‌2. మెర్స్‌-కోవ్‌ అంటే 'మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌), కరోనా వైర్‌ (కోవ్‌) అని. మధ్య ఆసియాలో ఇది తొలుత తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి రూపంలో బయటపడింది కాబట్టి దానికా పేరు పెట్టారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో 37 శాతం మరణాల రేటు ఉంటుంది. గతంలో మెర్స్ కరోనా వైరస్ వల్ల 936 మంది రోగులు మరణించడంతో ఇప్పుడు మరోసారి ఆందోళన నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story