Mariupol : రష్యా దాడులతో మహా శ్మశానంగా మారిన మరియుపోల్‌.. ఎక్కడ చూసినా సమాధులే...!

Mariupol : రష్యా దాడులతో మహా శ్మశానంగా మారిన మరియుపోల్‌.. ఎక్కడ చూసినా సమాధులే...!
Mariupol : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా మరియుపోల్‌ పట్టణం మహా శ్మశానంగా మారింది. ఎక్కడ చూసినా సమాధుల దిబ్బలే కనిపిస్తున్నాయి.

Mariupol: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా మరియుపోల్‌ పట్టణం మహా శ్మశానంగా మారింది. ఎక్కడ చూసినా సమాధుల దిబ్బలే కనిపిస్తున్నాయి. శాటిలైట్‌ చిత్రాల్లో భారీగా మట్టి గుట్టలు కనిపించడంతో.. ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరియుపోల్‌ పట్టణం ఎంతగా నాశనం అయిందో చూపుతూ మాక్సర్‌ టెక్‌ సంస్థ శాటిలైట్‌ ఫొటోలను విడుదల చేసింది. ఈ ఫొటోల్లో 200పైగా సమాధులు కనిపించాయి.

గతంలో బుచాలో రష్యా మారణకాండ జరిపిందనేందుకు ఆధారాలు లభించాయి. ఇప్పుడు అవే దృశ్యాలు మరియుపోల్‌లో కూడా కనిపిస్తున్నాయి. రష్యా జరుపుతున్న మారణహోమంలో 9వేల మంది పౌరులను సమాధి చేశారని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. దీనిపై రష్యా ఇప్పటి వరకు స్పందించలేదు. కాకపోతే, మరియుపోల్‌ పట్టణం తమ స్వాధీనమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వారం క్రితమే ప్రకటించారు.

ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు దాడులు చేస్తోంది రష్యా. ముఖ్యంగా తూర్పు వైపు ఫోకస్‌ పెట్టింది. డోన్బాస్‌ ప్రాంత నగరాలపై రష్యా దాడులు ముమ్మరం చేసింది. ఇక్కడ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి బదులు విడతల వారీగా తూర్పు వైపు నగరాలపై దాడులు చేస్తోంది. దీంతో ఈ ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు అనౌన్స్‌మెంట్స్‌ చేస్తున్నారు. అయితే, డోన్బాస్‌ ప్రాంతంపై పట్టు సాధించాలన్న రష్యా ప్రయత్నాలకు ఉక్రెయిన్‌ సైన్యం గట్టి బదులిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలపై ఇప్పటికే పట్టు సాధించామని రష్యా మిలటరీ చెబుతోంది.

రష్యా దళాలు ఆస్పత్రులు, స్కూళ్లు, జనావాసాలపై బాంబుల వర్షం కురిపించడంపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సమీకరించింది. యుద్ధంలో 2వేల 345 మంది చనిపోయారని, సరైన వైద్య సాయం అందక మరో 3వేల మంది మరణించారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. రష్యా సైనికుల లైంగిక నేరాలపై 75కు పైగా ఆరోపణలు వచ్చాయని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story