Wild fire : హవాయిలో కార్చిచ్చుకి 53 మంది సజీవ దహనం

Wild fire : హవాయిలో కార్చిచ్చుకి 53  మంది సజీవ దహనం
సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకుంటున్న ప్రజలు

పసిఫిక్‌ సముద్రంలోని అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. మాయి కౌంటీలో పర్యాటకానికి పేరుగాంచిన లహైనా అగ్నికీలల్లో చిక్కుంది. ‘దోరా’ తుఫాను ప్రభావంతో దావానలం వేగంగా వ్యాపిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న మంటల కారణంగా ఇప్పటికే మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో భవనాలు పూర్తిగా కాలిపోయాయి. ఎక్కడ చూసినా దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి.

దావాగ్నిచుట్టుముట్టడంతో ప్రజలు ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడుతున్నారు. ప్రాణాలను రక్షించుకునేందుకు పలువురు పిల్లలతో సహా పసిఫిక్‌ సముద్రంలోకి దూకారు. వీరిలో 14 మందిని కోస్ట్‌ గార్డ్స్‌ రక్షించారు. కాగా, లక్షన్నర గ్యాలన్ల నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. లహైనాలో మొత్తం 16 రహదారులను మూసివేశారు. తప్పనిసరి పరిస్థితులలో ఒక్క జాతీయ రహదారిని మాత్రమే తెరిచి ఉంచి సహాయ చర్యలు చేపడుతున్నారు. దీని ద్వారానే వేలమందిని తరలించారు. 11 వేల మంది పర్యాటకులను మాయికి తీసుకొచ్చామని, 271 భవనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. 2 వేల ఎకరాల్లో మంటలు వ్యాపించినట్లు చెప్పారు. కార్చిచ్చు కారణంగా గాయపడిన 20 మందిని ఎయిర్ అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

కార్చిచ్చుకు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్‌లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలి బూడిదైనట్లు చెప్పారు.

కార్చిచ్చు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హవాయి ద్వీపంలో ఇప్పటికే అత్యవసర ప్రతిస్పందనా బృందాలు సహాయక చర్యలు చేపడుతుండగా ఆర్మీ, నేవీ కూడా రంగంలోకి దిగాలని బైడెన్ ఆదేశించారు. దావానాలానికి నిర్దిష్ట కారణం ఏమిటతో తేలలేదు. వేసవిలో ఎండిపోయిన వృక్ష సంపదకు అంటుకున్న నిప్పు బలమైన గాలుల కారణంగా విస్తృతంగా వ్యాపించిందని అధికారులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story