Gaza-Israel conflict: కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ బాంబింగ్‌..

Gaza-Israel conflict: కొనసాగుతున్న  ఇజ్రాయెల్‌ బాంబింగ్‌..
కూలుతున్న భవనాలు.. కొనసాగుతున్న మారణ హోమం

భీకరదాడులతో గాజా తల్లడిల్లుతోంది. 14వేల మంది తలదాచుకున్న ఓ ఆస్పత్రి సమీపంలో ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. చిన్నారులు, క్షతగాత్రులు అత్యవసరచికిత్స పొందుతున్న సమయంలో దాడి జరిగినట్లు రెడ్‌ క్రెసెంట్‌ అనే మానవతాసంస్థ తెలిపింది. అటు గాజాలో మరణించినవారి సంఖ్య 8వేలు దాటింది. కాల్పుల విరమణ ప్రకటించాలని ఐరాస మరోసారి ఇజ్రాయెల్‌ను కోరింది.

గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ మరింత ఉద్ధృతం చేసింది. ఆదివారం అల్‌ ఖుడ్స్‌ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ సేనలు దాడి చేసినట్లు పాలస్తీనాలోని రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీ తెలిపింది. దాడులకు ముందు రెండుసార్లు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు తెలిపింది. అత్యవసర చికిత్స పొందుతున్న వారు, చిన్నారులతోపాటు 14 వేల మందికిపైగా తలదాచుకుంటున్నారని, ఆస్పత్రి ఖాళీ చేయడం అసాధ్యమని చెప్పినా ఇజ్రాయెల్‌ సేనలు దాడికి పాల్పడినట్లు రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీ వివరించింది. ఆదివారం జరిపిన భూతల దాడుల్లో అనేక మంది హమాస్‌ మిలిటెంట్లు హతమైనట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ఎరెజ్ క్రాసింగ్‌ సమీపంలో సొరంగ మార్గం నుంచి బయటికి వస్తుండగా దాడి చేసినట్లు తెలిపింది. హమాస్‌ కమాండ్ సెంటర్లు, యాంటీ ట్యాంక్ క్షిపణి స్థావరాలుసహా 450 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. తమదాడుల లక్ష్యం హమాస్‌ మిలిటెంట్లే తప్ప పౌరులుకాదని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడి లొంగిపోవాలని పౌరులకు సూచించింది. ఆదివారం ఒక్కరోజే మానవతా సాయం అందించే 33 ట్రక్కులు గాజాలో ప్రవేశించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అటు గాజాలో ఈనెల 7 నుంచి ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో చనిపోయినవారి సంఖ్య 8 వేలు దాటింది. అందులో 3వేల 195 మంది చిన్నారులే ఉన్నట్లు సేవ్‌ద చిల్డ్రెన్‌ వెల్లడించింది. అమాయక పౌరులను చంపడం న్యాయం కాదని నేపాల్‌ పర్యటనలో ఉన్న ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ మరోసారి ఇజ్రాయెల్‌కు సూచించారు.


గాజాపై దాడిని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఖండించడంపై ఇజ్రాయెల్‌ సీరియస్‌ అయింది. ఎర్డోగాన్‌ వ్యాఖ్యలను ఐరాసలోన ఇజ్రాయెల్‌ ప్రతినిధి గిలాద్‌ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్‌ కూడా తుర్కియేలోని తమ దౌత్య ప్రతినిధులను వెనక్కి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రపంచ దేశాలతో సమాచార సంబంధాలు పూర్తిగా తెగిపోయిన గాజాకు తమ ‘స్టార్‌లింక్‌’ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందజేస్తామని ఈలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. పశ్చిమాసియాలో దిగజారుతున్న పరిస్థితులు, మానవతా సంక్షోభంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌-సిసితో ఫోన్‌లో మాట్లాడినట్లు భారత ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story