Man Eat Wife Brain : దయ్యం చెప్పిందని మెదడు తిన్న మొగుడు

Man Eat Wife Brain : దయ్యం చెప్పిందని మెదడు తిన్న మొగుడు
భార్యను హత్య చేసి మెదడు తిన్న భర్త.. పుర్రెను యాష్‌ ట్రేగా వాడాడు

ఆధునిక సైన్స్ అభివృద్ధి చెంది టెక్నాలజీ యుగంలో మనం బతుకుతున్నాం. అయినా సరే కొంతమంది మూర్ఖులు ఇంకా మన మధ్యనే ఉన్నారు..ఎవరు ఎన్ని చెప్పినా వారు దయ్యాలు, భూతాలు ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతున్నారు. వాళ్ల నమ్మకం వాళ్ళది అని మనం వదిలేసినా వాళ్లు వదలరు. కొందరైతే ఏకంగా తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలా చేసిన ఓ వ్యక్తి చివరికి కటకటాల పాలయ్యాడు. దెయ్యం చెప్పిందని.. తన భార్యను చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె మెదడును తిని.. శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బయట పారేశాడు. ఇంతకీ ఈ అత్యంత హేయమైన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. మెక్సికోలో

ఫ్యూబ్లా నగరంలో నివసించే 32 ఏళ్ల అల్వారో, దెయ్యం చెప్పింది అని తన సొంత భార్యని హత్య చేశాడు. 38 ఏళ్ల మరియా మోంట్‌సెరాట్ ను వివాహం చేసుకున్నాడు. అప్పటికే మరియాకు ఐదుగురు కూతుర్లు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం మరియ కూతుర్లలో ఒకరికి అల్వారో ఫోన్ చేశాడు. మరియాను చంపి ప్లాస్టిక్ సంచుల్లో నింపి ఉంచానని వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. ఆమె పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు అల్వారోను అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం విస్తుపోయే నిజాలను బయటపెట్టారు.


మరియాను జూన్ 29 న తన ఇంట్లోనే హత్య చేసినట్లు విచారణలో అల్వారో అంగీకరించాడు. అయితే శాంటా ముర్టే అనే దయ్యం ఆదేశాల మేరకు తన భార్య మరియాను హత్య చేసినట్లు చెప్పాడు. హత్య తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం మరియా మెదడును బయటికి తీసి తిన్నట్లు చెప్పాడు. ఆ తర్వాత మరియా శరీర భాగాలను సంచుల్లో నింపి తన ఇంటి వెనకాల ఉన్న అటవీ ప్రాంతంలోని లోయలో పడేసినట్లు పోలీసులకు వివరించాడు.

తన కుమార్తెను నిందితుడు అల్వారో అతి కిరాతకంగా సుత్తె, కొడవలితో హత్య చేశాడని మరియా తల్లి ఆరోపించారు. మరియాకు చెందిన ఐదుగురు సంతానంలో ఇద్దరు చిన్నపిల్లలు మాత్రమే వారితో ఉంటారు. అల్వారో పెద్ద పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే వాడని, ఆ విషయాలన్నీ తెలిసి తన కుమార్తె కూడా అల్వారోను దూరం పెట్టేదని ఆమె పేర్కొన్నారు.

అల్వారో దయ్యానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాల్లో పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. అల్వారో ఇంట్లో చేతబడికి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడు డ్రగ్స్‌కు బానిస కావడం వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొనే వాడని చెప్పారు. అతని కాలుమీద దయ్యానికి సంబంధించిన పచ్చబొట్టు కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే మరియాకు చెందిన మృతదేహానికి సంబంధించిన భాగాలు పూర్తిగా లభ్యం కాలేదని.. మరికొన్నింటిని గుర్తించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. వాటికి డీఎన్ఏ పరీక్ష కూడా నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్యూబ్లా ప్రాసిక్యూటర్ కార్యాలయం సమగ్ర దర్యాప్తు జరుపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story