UKRAINE: యుద్ధంలో 10వేల మంది పౌరులు మృతి

UKRAINE: యుద్ధంలో 10వేల మంది పౌరులు మృతి
అందులో 499 మంది చిన్నారులు కూడా మరణించారన్న ఉక్రెయిన్‌... రష్యాపై 98 వేల యుద్ధ నేరాలు నమోదు చేసినట్లు వెల్లడి

రష్యా(Russia) చేస్తున్న దండయాత్రలో ఇప్పటివరకూ తమ వైపు 10 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ ప్రభుత్వం(Ukraine ) ప్రకటించింది. వీరిలో 499 మంది పిల్లలు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయంలో యుద్ధ నేరాల విభాగం అధికారి(Ukraine’s War Crimes Department) యూరియ్‌ బెల్‌సోవ్‌ (Yuriy Belousov) తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధంలో భాగంగా రష్యా సేనలు ఉక్రెయిన్‌లో చేసిన 98 వేల యుద్ధ నేరాలను తమ విభాగం నమోదు చేసిందని యూరియ్‌ తెలిపారు.


దాదాపుగా ఏడాదిన్నారగా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడి(Russian invasion)లో 10,749 మంది పౌరులు( 10,749 Ukrainian civilians) మరణించారని,15,599 మంది గాయపడ్డారని యూరియ్‌ వివరించారు. మరియుపోల్‌లోనే 10 వేల మంది మరణించి ఉంటారని అంచనా వేస్తున్నామని ఆయన వెల్లడించారు. రష్యా దాడుల్లో 500 మంది పిల్లలు సహా సుమారు 9 వేల మంది ఉక్రెయిన్‌ పౌరులు మృతి చెంది ఉంటారని ఐక్యరాజ్య సమితి కూడా గత నెల నివేదిక విడుదల చేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది.


మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఖేర్సన్ లోని ఓ చర్చిపై రష్యా బలగాలు బాంబు దాడులు చేశాయి. సెయింట్ కేథరిన్స్ చర్చిపై రష్యా బలగాలు దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవ విభాగం తెలిపింది.ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు వెల్లడించింది. గతేడాది నవంబరులో ఖేర్సన్ నుంచి రష్యాన్ బలగాలు వైదొలిగాయి. ఉక్రెయిన్‌ నౌకాశ్రయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఉక్రెయిన్‌ -రొమేనియా సరిహద్దులోని ఇజ్మాయెల్‌ దగ్గర డాన్యూబ్‌ నదిపై ఉన్న నౌకాశ్రయాన్ని డ్రోన్లు ప్రయోగించి ధ్వంసం చేసింది. ఈ దాడులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పొందుపరిచారని వికీపీడియా, యాపిల్ సంస్థలకు ఆ దేశ కోర్టు జరిమానా విధించింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా సైనికులను కించపరిచే విధంగా వికీపీడియా సంస్థ తమ వెబ్ సైట్ లో సమాచారాన్ని ఉంచిందని కోర్టు పేర్కొంది. ఇది చట్టానికి వ్యతిరేకమని 33 వేల డాలర్ల జరిమానా విధించింది. యాపిల్ కూడా తన ఫోన్ లలో రష్యా సైనికులపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పోడ్ కాస్ట్ లను, యాప్ లను తొలగించడంలో విఫలమైందని పేర్కొంది. అందుకు గాను 4 లక్షల రూబెల్ల జరిమానా విధించింది.

Tags

Read MoreRead Less
Next Story