Moon Missions : జాబిల్లి గుట్టు విప్పేందుకు ప్రపంచ దేశాలు రెడీ

Moon Missions : జాబిల్లి గుట్టు విప్పేందుకు ప్రపంచ దేశాలు రెడీ
2024లో 12 ప్రయోగాలు

జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపి భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్‌ ఇచ్చిన ప్రేరణతో ప్రపంచ దేశాలు మరిన్ని పరీక్షలకు సిద్ధమయ్యాయి. వచ్చే ఏడాది జాబిల్లి ప్రయోగాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలవనుంది. నెలరాజు గుట్టువిప్పేందుకు ఒక్క 2024లోనే 12 ప్రయోగాలు జరగనున్నాయి. చంద్రుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఒక్క ఏడాదిలో జరిగే అత్యధిక ప్రయోగాలు ఇవే. జనవరిలోనే 3ప్రయోగాలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 19న తన తొలి ల్యూనార్ ల్యాండింగ్ మిషన్‌ను జపాన్‌ చేపట్టనుంది. SLIMమిషన్‌ను ప్రయోగించి విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపిన ఐదో దేశంగా నిలవాలని జపాన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. నాసాకు ల్యూనార్‌ పేలోడ్ సేవలు అందిస్తున్న అమెరికాకు చెందిన ఇంట్యూటివ్ మెచీన్స్‌, అస్ట్రోబోటిక్ కూడా చంద్రుడిపై ప్రయోగాల రేసులో ఉన్నాయి. జనవరిలోనే చేపట్టనున్న అస్ట్రోబోటిక్‌ సంస్థ మెక్సికో అభివృద్ధి చేసిన చిన్నపాటి రోవర్‌లను చంద్రుడిపైకి తీసుకెళ్లనుంది. మెక్సికోకు ఇదే తొలి ల్యూనార్‌ మిషన్ కానుంది. చైనా తన చాంగ్‌ ఈ-6 మిషన్‌ను మే నెలలో చేపట్టనుంది. చైనా చేపట్టిన చాంగ్‌ ఈ-5 విజయవంతంగాచందమామ ఉపరితలంపై దిగింది. చాంగ్‌ ఈ 5 సేకరించిన శాస్ర్తీయ నమూనాలను తిరిగి చాంగ్‌ ఈ6తో.. జాబిలిపైకి డ్రాగన్‌ పంపనుంది. వ్యోమగాములను జాబిల్లి కక్ష్యలోకి తీసుకెళ్లే ఆర్టెమిస్‌ 2 మిషన్‌ను అమెరికా నవంబరులోచేపట్టనుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఆర్టెమిస్‌-2 పరిభ్రమించనుంది. ఈ ప్రయోగం తర్వాత 2026 లేదా 2027లో వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని నాసా భావిస్తోంది. ఏరియన్ 6 ప్రయోగం కూడా ఈ ఏడాది మధ్యలో ఐరోపా చేపట్టే అవకాశం ఉంది.

మరోవైపు ప్రైవేట్‌ సంస్థలు కూడా చంద్రునిపై ప్రయోగాలకు... సిద్ధమయ్యాయి. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ చంద్రుడి కక్ష్యలోకి న్యూ గ్లెన్ ప్రయోగం చేపట్టనుంది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్‌ కూడా ఈ ఏడాది ప్రయోగానికి సిద్ధమైంది. పెద్ద పెద్ద ప్రయోగాల మధ్య.... అనేక అనేక చిన్న ఫ్లైబైలు, ఆర్బిటర్లు, ల్యాండర్ల ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భవిష్యత్తులో జరిగే మిషన్‌ల కోసం.. చైనా ఒక రిలే ఉపగ్రహాన్ని పంపుతోంది. జపాన్‌ ఫ్లైబైను పంపేందుకు సిద్ధంగా ఉంది. తన వైపర్ రోవర్‌ను చంద్రుని దక్షిణ ధ్రువానికి నాసా పంపనుంది. అంతరిక్ష రంగంలో వచ్చే ఏడాది కూడా భౌగోళిక రాజకీయ పురోగతి కొనసాగే అవకాశం ఉంది. అంతరిక్ష అన్వేషణకు, ముఖ్యంగా జాబిల్లిపై ప్రయోగాలకు సంబంధించి అమెరికా రూపొందించిన ఆర్టెమిస్‌ ఒప్పందంలో భారత్‌ భాగమైంది. ఈ ఒప్పందంలో మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story