TikTok : న్యూయార్క్ సిటీలో టిక్‌టాక్‌పై నిషేధం

TikTok : న్యూయార్క్ సిటీలో టిక్‌టాక్‌పై నిషేధం
ప్రభుత్వ పరికరాలలో టిక్‌టాక్‌ను నిషేధం

న్యూయార్క్ సిటీలో వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌పై నిషేధం విధించారు. న్యూయార్క్ నగరంతోపాటు కొన్ని ఇతర నగరాల్లో భద్రతా సమస్య కారణాలతో ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్‌టాక్‌ను నిషేధించారు. చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డాన్స్ యాజమాన్యంలో ఉన్న టిక్‌టాక్ ను 150 మిలియన్లకు పైగా అమెరికన్లు ఉపయోగిస్తున్నారు. చైనా ప్రభుత్వ ప్రభావం గురించి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా అంతటా ఈ యాప్ నిషేధం కోసం యూఎస్ చట్టసభల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. టిక్ టాక్ సాంకేతిక నెట్‌వర్క్‌లకు భద్రతా ముప్పును కలిగిస్తుందని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

న్యూయార్క్ సిటీ ఏజెన్సీలు యాప్‌ను 30 రోజుల్లోగా తీసివేయాల్సిందిగా కోరారు. లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు న్యూయార్క్ నగర యాజమాన్యంలోని పరికరాలు, నెట్‌వర్క్‌లలో యాప్ యాక్సెస్‌ను కోల్పోతారు. న్యూయార్క్ రాష్ట్రం ఇప్పటికే ఇష్యూ చేసిన కొన్ని మొబైల్స్ లో టిక్‌టాక్‌ నిషేధం అమలులో ఉంది.


యూఎస్లో వ్యక్తుల డేటాను చైనీస్ ప్రభుత్వంతో పంచుకోలేమని, టిక్‌టాక్ వినియోగదారుల గోప్యత, భద్రతను రక్షించడానికి ఇప్పటికే గణనీయమైన చర్యలు తీసుకున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ చెప్పారు. టిక్ టాక్ భద్రతా పరమైన ముప్పు కలిగిస్తుందని ఎఫ్‌బీఐ డైరెక్టర్, సీఐఏ సహా యూఎస్ భద్రతా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పరికరాల్లో ఎంతో సున్నితమైన సమాచారం ఉంటుందని, అందుకే ముప్పును నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు వెల్లడించారు. మిలియన్ల కొద్దీ పరికరాల్లో సాఫ్ట్‌వేర్‌ను నియంత్రించడానికిచైనా ప్రభుత్వం టిక్‌టాక్‌ను ఉపయోగించవచ్చని వారు మార్చిలో చెప్పారు. నిజానికి 2020లోనే అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ కొత్త డౌన్‌లోడ్‌లను నిషేధించటానికి ప్రయత్నించారు. అయితే కోర్టు నిషేధం అమలులోకి రాకుండా నిరోధించింది. కానీ చట్టసభల్లో టిక్ టాక్ వినియోగించరాదని అమెరికా ఎప్పుడో ఆదేశాలు జారీ చేసింది. రానురాను అమెరికాలోని పలు రాష్ట్రాలు, నగరాలు ప్రభుత్వ పరికరాల్లో టిక్ టాక్ ను పరిమితం చేశాయి. మోంటానా ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా యాప్‌ను నిషేధించే బిల్లును ఆమోదించింది. ఈ నియమం జనవరి 1వతేదీ నుంచి అమలులోకి రానుంది.

కెనడా, బెల్జియం, బ్రిటన్ లలో కూడా ఇంతకుముందే ప్రభుత్వ పరికరాల్లో టిక్ టాక్ పై నిషేధం విధించాయి. ఇక భారత్ లో టిక్ టాక్ యాప్ పై 2020లోనే వేటు పడడం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story