Ballistic Missiles: ఒకటి కాదు మూడు బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను ప‌రీక్షించిన ఉత్త‌ర కొరియా

Ballistic Missiles: ఒకటి కాదు మూడు బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను ప‌రీక్షించిన ఉత్త‌ర కొరియా
తూర్పు స‌ముద్రంలోకి విడుదల ..

నార్త్ కొరియా ఇవాళ ప‌లు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల‌ ను ప‌రీక్షించింది. తూర్పు స‌ముద్రంలోకి వాటిని విడుద‌ల చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో.. ఉత్త‌ర కొరియా ఈ క్షిప‌ణులను ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది. రెండు నెల‌ల త‌ర్వాత తొలిసారి ఉత్త‌ర కొరియా బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను ప‌రీక్షించింది. ఉద‌యం 7.44 నిమిషాల నుంచి 8.22 నిమిషాల మ‌ధ్య ఫైరింగ్ జ‌రిగినట్లు సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆప్ స్టాఫ్ తెలిపారు. ఆ మిస్సైల్స్ సుమారు 300 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాయి. ఆ త‌ర్వాత అవి తూర్పు స‌ముద్రం(సీ ఆఫ్ జ‌పాన్‌)లో ల్యాండ్ అయ్యాయి.

ఉత్త‌ర కొరియా క‌నీసం మూడు క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించి ఉంటుంద‌ని భావిస్తున్నారు. కేఎన్-24 మిస్సైల్స్ త‌ర‌హాలో అవి ప్ర‌యాణించిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. కేఎన్-24.. సాలిడ్ ఫ్యూయ‌ల్ బాలిస్టిక్ మిస్సైల్‌. అది సుమారు 410 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌గ‌ల‌దు. ఆ మిస్సైల్ దాదాపు 500 కేజీల బ‌రువున్న పేలోడ్‌ను మోసుకెళ్ల‌గ‌ల‌దు. ఉత్త‌ర కొరియా నిర్వ‌హించిన మిస్సైల్ ప‌రీక్ష‌ల‌ను జ‌పాన్ ప్ర‌ధాని కిషిద ఖండించారు.

కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాలలో ఉత్తర కొరియా క్షిపణులు పడినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా పార్లమెంటరీ సమావేశంలో తెలియజేశారు. అవి జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలం వెలుపల పడ్డాయని, ఎటువంటి నష్టమూ జరగలేదని, ఎవరూ గాయపడలేదని ఆయన తెలిపారు. ఉత్తర కొరియా పదే పదే జరుపుతున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను ‘జపాన్, ప్రాంతం, అంతర్జాతీయ సమాజం శాంతి, భద్రతకు ముప్పు కలిగించే’ చర్యలుగా కిషిదా ఖండించారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష కార్యకలాపాలకు జపాన్ తీవ్ర నిరసన తెలియజేసిందని ఆయన చెప్పారు. ఎటువంటి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు జరపకుండా ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను అవి ఉల్లంఘించాయని కిషిదా ఆరోపించారు.

సోమవారం ఉదయం ఉత్తర కొరియా సాగించిన పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు తమ దృష్టికి కూడా వచ్చాయని దక్షిణ కొరియా సైన్యం తెలియజేసింది. జపాన్, దక్షిణ కొరియా మదింపుల ప్రకారం, ఉత్తర కొరియా రాజధాని ప్రాంతం నుంచి ప్రయోగించిన క్షిపణులు గంటకు 50 కిమీ గరిష్ఠ వేగంతో 300, 350 కిలో మీటర్ల దూరం ప్రయాణించాయి. అమెరికా విదేశాంగ శాఖ కూడా ఆ క్షిపణి పరీక్షలను ఖండించింది.

Tags

Read MoreRead Less
Next Story