అమెరికా విమానాలను కూల్చేస్తాం: కిమ్‌ సోదరి

అమెరికా విమానాలను కూల్చేస్తాం: కిమ్‌ సోదరి
అమెరికాకు కిమ్‌ సోదరి తీవ్ర హెచ్చరికలు.... తమ భూభాగంలోకి వచ్చే అగ్రరాజ్య విమానాలు కూల్చేస్తామని వెల్లడి.... తీవ్ర పర్యావసానాలు తప్పవని వార్నింగ్‌

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రాజ్యంలో ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ అత్యంత శక్తిమంతమైన నేతగా కొనసాగుతున్నారు. అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న ఆమె కిమ్‌ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ భాగస్వామిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. తమతో పెట్టుకోవద్దని తేల్చి చెప్పారు. తమ భూ భాగంలోకి అగ్రరాజ్య నిఘా విమానాలు ప్రవేశిస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా గూఢచారి విమానం ఉత్తర కొరియా తూర్పు గగనతలంలోకి రెండుసార్లు చొరబడిందని దానిని తమ జెట్స్‌ తరిమి కొట్టాయని కిమ్‌ యో జోంగ్‌ వెల్లడించారు. ఇలాంటి అక్రమ చొరబాట్లు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికాను ఆమె తీవ్రంగా హెచ్చరించారు.


అమెరికా తన వైమానిక నిఘా కార్యకలాపాల ద్వారా ఉత్తరకొరియాలో సైనిక ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని చూస్తోందని కిమ్ యో జోంగ్ వెల్లడించారు. ఇంకోసారి తమ దేశంలోకి అగ్రరాజ్య గూఢచారి విమానాలు చొరబడితే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేసింది. అమెరికా ఇలా అనాలోచితంగా ప్రవర్తిస్తే జరిగే పర్యావసానాలు కఠినంగా ఉంటాయని కూడా యో జోంగ్‌ తెలిపారు. జూలై 10న అమెరికా గూఢచారి విమానం ఉత్తరకొరియా ఎకనామిక్ జోన్‌లోకి ప్రవేశించిందని ఆరోపించారు.


సోమవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు ఎనిమిది సార్లు సముద్ర సైనిక సరిహద్దు రేఖ దాటి అమెరికా నిఘా విమానం తమ దేశంలోకి చొరబడేందుకు యత్నించిందని ఉత్తరకొరియా తెలిపింది. 1977 నేషనల్ ఎకనామిక్ జోన్ చట్టం ప్రకారం ఇది తీవ్రమైన నేరమని వెల్లడించింది. ఆ విమానాన్ని తరిమికొట్టామని వెల్లడించారు. నిఘా విమానాల ప్రవేశం ద్వారా అమెరికా తమ గగనతల నిబంధనలను ఉల్లంఘించిందని ఉత్తర కొరియా ప్రకటించింది. వైమానిక నిఘా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా తాము కఠిన నిర్ణయం తీసుకునేలా చేయవద్దని కిమ్ సోదరి అమెరికాను హెచ్చరించారు.


గగనతల ఉల్లంఘనలకు సంబంధించి ఉత్తరకొరియా ఆరోపణలను దక్షిణ కొరియా ఖండించింది. అమెరికా ఎప్పటిలాగే సాధారణ నిఘా కార్యకలాపాలు చేపట్టిందని అవి నిత్యం జరిగేవేనని వెల్లడించింది. ఇలాంటి తప్పుడు ఆరోపణల ద్వారా ఉద్రిక్తత సృష్టించే చర్యలను వెంటనే నిలిపివేయాలని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రతినిధి కిమ్‌ సోదరికి సూచించారు. అమెరికా బాధ్యతాయుతంగా అంతర్జాతీయ జలాలు, గగనతలంలో పనిచేస్తుందని వివరించారు. కిమ్ సోదరి వ్యాఖ్యలపై అమెరికా కూడా పరోక్షంగా స్పందించింది. అంతర్జాతీయ చట్టం అనుమతించే ఎక్కడైనా సురక్షితంగా, బాధ్యతాయుతంగా తమ విమానాలు తిరుగుతాయని పెంటగాన్ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story