Kim Jong-un: రెచ్చగొడితే అణుదాడి తప్పదు..

Kim Jong-un:  రెచ్చగొడితే అణుదాడి తప్పదు..
అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగం

అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా హెచ్చరించారు. గురువారం మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్..డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రత్యర్థి అణుబాంబులతో రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు కిమ్ సూచించినట్టు కేసీఎన్ఏ పేర్కొంది. చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.

గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా, దక్షిణకొరియా మధ్య కీలక సమావేశం జరిగింది. ఉత్తరకొరియాతో యుద్ధం తలెత్తే పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగింది. కాగా, ఉత్తరకొరియా తమపై అణ్వస్త్రాలు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందంటూ ఉభయ దేశాలూ సమావేశం అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేశాయి. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో పాల్గొనాలని కిమ్‌కు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడి హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఆపడం లేదు. స్వల్పశ్రేణి క్షిపణిని పరీక్షించిన గంటల వ్యవధిలోనే ఓ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ని ప్రయోగించింది. గత ఐదు నెలల్లో ఉత్తర కొరియా ఓ `ఐసీబీఎం'ను ప్రయోగించడం ఇదే మొదటిసారి. దక్షిణ కొరియా, జపాన్లు ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించాయి. ఈ క్షిపణి ఆరు వేల కిలోమీటర్ల ఎత్తువరకు చేరుకుందని జపాన్ తెలిపింది. దీన్ని మరింత మెరుగైన, చురుకైన ఆయుధంగా నిపుణులు భావిస్తున్నారు. అణు కార్యకలాపాలు చేపట్టకుండా ఉత్తర కొరియాను నిలువరించేందుకు మరిన్ని ప్రణాళికలు రచించాలని దక్షిణ కొరియా, అమెరికాలు యోచిస్తున్న తరుణంలో ఆ దేశం ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం గమనార్హం.

ఈ క్షిపణి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాల్లో పడినట్లు దక్షిణ కొరియా తెలిపింది. గరిష్ఠంగా 6,000 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుందని జపాన్ అంచనా వేసింది. ఈ ప్రయోగ ఫలితాలు ఉ.కొరియా ఈ ఏడాది జులైలో నిర్వహించిన 'హ్వసాంగ్-18' క్షిపణి రెండో పరీక్షతో సరిపోలాయి. అంతకుముందు ఏప్రిల్లో తొలిసారి ఈ క్షిపణిని పరీక్షించింది. కిమ్ జోంగ్ ఉన్ గతంలో 'హ్వసాంగ్-18'ని తన అణ్వాయుధాల్లో అత్యంత శక్తిమంతమైనదిగా పేర్కొన్నారు. అమెరికా, ద.కొరియా, జపాన్లు తాజా క్షిపణి ప్రయోగాన్ని ఖండించాయి.

Tags

Read MoreRead Less
Next Story