మహమ్మారికో దండం.. వచ్చి 'వన్ ఇయర్'

మహమ్మారికో దండం.. వచ్చి వన్ ఇయర్
వైరస్ వెలుగు చూసిన తొలి రోజుల్లో కేసుల సంఖ్య తక్కువగా నమోదైనా కొద్ది నెలల్లోనే మహమ్మారి

ఏడాది కాలంగా ఎవరి నోట్లో చూసినా కరోనా అనే పదం నానుతూనే ఉంది.. ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో కాని ప్రపంచం మొత్తాన్ని పరుగులు పెట్టించింది. లేచిన దగ్గరనుంచి ఇంట్లో వాళ్ల పేరు మర్చి పోయి కరోనా పేరే కలవరించేలా చేసింది.. నవంబర్ 17, 2019లో చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు హాంకాంగ్ పత్రిక ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. వైరస్ వెలుగు చూసిన తొలి రోజుల్లో కేసుల సంఖ్య తక్కువగా నమోదైనా కొద్ది నెలల్లోనే మహమ్మారి విశ్వవ్యాప్తమైంది. ఈ రోజు వరకు కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది.

ఒక మహమ్మారి ఇంతటి భయంకరమైన విపత్తును చూపిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అగ్రరాజ్యాలు సైతం కోవిడ్ బారిన పడి విలవిలలాడాయి. లాక్డౌన్ కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన దేశాలు కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నాయి. ఒకరిద్దరితో మొదలైన్ వైరస్ వ్యాప్తి లక్షలాది మందికి సోకింది.. పేద, ధనిక తారతమ్యాలు చూపించకుండా అందరినీ ఒకే గాటన కట్టింది.. కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులెందరో. ఇప్పటి వరకు దాదాపు అయిదున్నర కోట్ల మంది కరోనాతో పోరాటం చేశారు. మొదట్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నా జూన్, జులై, ఆగస్ట్ నెలలో విజృంభించింది. ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు 55 మిలియన్ల జనాభాకు కరోనా సోకగా 35.2 మిలియన్ల మంది కోలుకున్నారు. 1.33 మిలియన్ల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కానీ కరోనా వల్ల చెడు ఎంత జరిగిందో మంచి కూడా కొంత జరిగిందనే విషయాన్ని చెప్పుకోక తప్పదు.. కరోనా ప్రజలకు వ్యక్తిగత శుభ్రత నేర్పింది. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకూడదని హెచ్చరించింది. ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించింది. సాటి మనిషికి సహాయం చేసే గుణాన్ని అలవరిచింది. మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొలిపింది. అయితే మహమ్మారి వ్యాప్తిని అరికట్టే వ్యాక్సిన్ ఇంతవరకు రాకపోవడం దురదృష్టకరం.. తీవ్రతను తగ్గించే ఔషధాలతోనే కరోనాను కొంత వరకు కట్టడి చేయగలుగుతున్నారు. వైద్య రంగ నిపుణుల అవిరళ కృషి ఫలితంగా మరి కొంతకాలంలో వ్యాక్సిన్ ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story