MEXICO: మెక్సికోలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత.. 100మందికిపైగా మృతి

MEXICO: మెక్సికోలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత.. 100మందికిపైగా మృతి
అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న మెక్సికో... 50 డిగ్రీలు నమోదు... వందమందికిపైగా మృతి..


మండుతున్న ఎండలతో మెక్సికో అల్లాడిపోతోంది. ఉక్కపోత, వేడిగాలులతో ప్రజలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 50 డిగ్రీలు నమోదు అవుతుండడంతో వడదెబ్బకు ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. భగ భగ మండే ఎండలతో మెక్సికోలో గత రెండు వారాల్లోనే వంద మందికిపైగా మరణించినట్లు మెక్సికో హెల్త్ సెక్రటేరియెట్ వెల్లడించింది. ఈ నెలలో దేశంలో విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయికి చేరిందని, దీనివల్ల ఎనర్జీ గ్రిడ్‌ విఫలమైందని కూడా అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ గ్రిడ్‌ వైఫల్యంతో చాలా ప్రాంతాల్లో అధికారులు కరెంట్‌ కోతలు విధిస్తున్నారు. దీనివల్ల ఓ వైపు ఠారెత్తిస్తున్న ఎండలు, మరోవైపు వేడిగాలులతో మెక్సికన్లు అతలాకుతలం అవుతున్నారు.

మెక్సికోలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయని.. దీనివల్ల గత రెండు వారాల్లో కనీసం 100 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో చాలా ఎక్కువ మరణాలు జూన్‌ 18 నుంచి 24వ తేదీ మధ్యే సంభంవించాయని ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో ఉష్ణోగ్రతల వల్ల కేవలం ఒకే మరణం సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే వందమందికిపైగా మరణించారని వివరించింది. అన్ని మరణాలు వడదెబ్బ వల్లే సంభవించాయని స్పష్టం చేసింది. కొంత మంది డీహైడ్రేషన్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మెక్సికో ప్రభుత్వం తెలిపింది. దాదాపు 64 శాతం మరణాలు టెక్సాస్ సరిహద్దులోని ఉత్తర రాష్ట్రమైన న్యూవో లియోన్‌లో సంభవించాయి. తమౌలిపాస్, వెరాక్రూజ్‌ రాష్ట్రాల్లోనూ భారీగా ప్రజలు మరణించారు. అధిక ఉష్ణోగ్రతలతో 1559 మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. టామూలీపాస్ రాష్ట్రంలో భానుడి ప్రతాపానికి 19 మంది మరణించారని ఆ రాష్ట్ర గవర్నర్ అమెరికో విల్లార్రీల్ అనయా చెప్పారు. మండుతున్న ఎండల బారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు చల్లటి గదుల్లో వెంటిలేషన్ ఉన్న ప్రాంతాల్లో ఉండాలని టామూలీపాస్ హెల్త్ సెక్రటరీ కోరారు.

అకోంచి, సహా చాలా పట్టణాల్లో దాదాపుగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే కొన్ని ఉత్తరాది నగరాల్లోనే ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. దాహంగా లేకపోయినా నీళ్లు ఎక్కువగా తాగాలని హితవు పలికింది.

Tags

Read MoreRead Less
Next Story