Syria: సిరియా మిలటరీ అకాడమీపై బాంబులు

Syria: సిరియా మిలటరీ అకాడమీపై బాంబులు
100 మందికి పైగా మృతి, 125 మందికి గాయాలు

సిరియాలో విషాదం చోటుచేసుకుంది. హోమస్‌ ప్రావిన్స్‌లో ఉన్న మిలటరీ అకాడమీపై జరిగిన బాంబు దాడుల్లో వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో మిలటరీ సిబ్బందితో పాటు, పౌరులు కూడా ఉన్నారు. రక్తం మడుగులు, మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భయంకరంగా కనిపించింది. మిలిటరీ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న సైనిక అధికారులకు గ్రాడ్యేయేషన్ డేను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరియా రక్షణ మంత్రి సహా , ఆర్మీ కమాండర్‌లు హాజరయ్యారు. వారిని లక్షంగా చేసుకుని తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడికి పాల్పడ్డారని సిరియా సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆయన వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే బాంబులను మోసుకు వచ్చిన డ్రోన్లు దాడి చేశాయి. సిరియా సైనిక లక్ష్యాలపై ఇప్పటివరకు జరిగిన అత్యంత రక్తపాత దాడిగా దీనిని అభివర్ణించారు. సిరియా గత 12 ఏళ్లుగా అంతర్యుద్ధంతో పోరాడుతోంది.


సిరియాలో మరోసారి ఉగ్రవాదులు భీకర దాడులు చేశారు. సిరియన్ మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ దాడుల్లో 125 మంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోంస్‌లో డ్రోన్ దాడులకు ఉగ్రవాద సంస్థలు కారణమని సమాచారం. పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లతో దాడి చేశారు. వీరి మృతికి సంతాప సూచకంగా సిరియా ప్రభుత్వం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. డ్రోన్ల ద్వారా బాంబులు జారవిడచడం ఇదే ప్రథమం. సిరియాలో గత 12 ఏళ్లుగా అంతర్యుద్ధం జరుగుతున్నప్పటికీ డ్రోన్లతో బాంబు దాడులు చేయడం గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదు.


సాయుధ డ్రోన్లు రంగ ప్రవేశం చేయడంతో ఆందోళన నెలకొంది. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయన్నది ఇంకా తెలియరాలేదు. ఈ దాడికి పూర్తి స్థాయిలో బదులిస్తామని ఆ దేశ రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. అదే సమయంలో ఉగ్రవాదులు ఆక్రమించిన ఇడ్లిబ్ ప్రాంతంలో సిరియా ప్రభుత్వ బలగాలు రోజంతా భారీ బాంబులతో దాడులు చేస్తున్నాయి. అంతకు ముందు సిరియా సైన్యం తిరుగుబాటుదారులు ఉంటున్న ఓ గ్రామంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గ్రామస్థులు సహా పలువురు అత్యవసర సిబ్బంది మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story