Pakistan : తొలిసారి కృత్రిమ వర్షం..

Pakistan :  తొలిసారి కృత్రిమ వర్షం..
కాలుష్యం తగ్గించేందుకే

ప్రపంచంలోని అత్యంత కలుషితమైన నగరాల్లో ఒకటైన లాహోర్‌లో తొలిసారి శనివారం కృత్రిమ వర్షం కురిసింది. UAE సహాయంతో పాక్‌లోని ప్రభుత్వం ఈ ప్రయోగం చేసింది. లాహోర్‌లోని 10 ప్రాంతాల్లో ఈ ప్రయోగం నిర్వహించామని, విజయవంతం అయిందని పంజాబ్ కేర్‌టేకర్ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ మీడియాకు వెల్లడించారు. క్లౌడ్ సీడింగ్ ప్రయోగాల కారణంగా లాహోర్‌లో 15 కిలోమీటర్ల పరిధిలోని తేలికపాటి జల్లులు పడ్డాయన్నారు. 48 ఫ్లేర్స్‌తో కూడిన రెండు విమానాలను యూఏఈ పంపగా.. వాటి సహాయంతో వర్షం కురిపించింది. ఐక్యూ ఎయిర్‌ ప్రకారం.. డిసెంబర్‌ 18 నాటికి లాహోర్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 192గా ఉంది.


కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా పిలుస్తుంటారు. రసాయనాల సహాయంతో మేఘాలపై చల్లడం ద్వారా అవి వర్షాన్ని కురిపిస్తాయి. దీన్నే కృత్రిమ వర్షమని పిలుస్తుంటారు. అయితే, ఇది సులభమైన ప్రక్రియ కాదు. దానికి అనుమతి అవసరం ఉంటుంది. చాలా దేశాలు అత్యవసరమైన సమయంలో కృత్రిమ వర్షాలు కురిపిస్తుంటాయి. ప్రపంచంలో తొలిసారిగా 1945లో కృత్రిమ వర్షం అనే కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దీన్ని 50 దేశాల్లో వినియోగిస్తున్నారు. భారతదేశంలో 1951లో తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించారు. ఆ తర్వాత 1973లో ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులు తలెత్తడంతో సాంకేతికను వినియోగించగా.. ఆ తర్వాత కర్నాటక, తమిళనాడులోనూ ప్రక్రియను అవలంభించారు. చైనాలో 2008లో బీజింగ్‌ ఒలింపిక్స్‌ సమయంలో క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియ నిర్వహించి.. వర్షాన్ని కురిపించారు.




Tags

Read MoreRead Less
Next Story