కామాంధులపై పాక్ సర్కార్ కఠిన నిర్ణయం..

కామాంధులపై పాక్ సర్కార్ కఠిన నిర్ణయం..
ఇందుకు సంబంధించిన బిల్లుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోద ముద్ర వేసినట్లు స్థానిక మీడియా జియో టీవీ వెల్లడించింది.

ప్రభుత్వాలు ఎన్ని మారినా చట్టాల్లో మార్పు రాదు.. కామాంధులకు సరైన శిక్షలు పడవు.. అత్యాచార బాధితులకు సత్వర న్యాయం జరగదు.. ఈ దుస్థితే మరికొందరిని పురిగొల్పుతుంది.. అమాయకపు మహిళలు, చిన్నారులు కామాంధుల పైశాచికత్వానికి బలైపోతున్నారు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కామాంధులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. అత్యాచారాల కట్టడికి కఠినమైన చట్టాలు రూపొందించనుంది.

ఇందులో భాగంగా రేపిస్టుల లైంగిక పటుత్వం తగ్గేలా ఆపరేషన్లు నిర్వహించాలనుకుంటోంది. దీంతో పాటు అత్యాచార బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోద ముద్ర వేసినట్లు స్థానిక మీడియా జియో టీవీ వెల్లడించింది. మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో భాగంగా న్యాయశాఖ ముసాయిదాను ప్రవేశపెట్టగా ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇమ్రాన్ భావించినట్లు పేర్కొంది. పౌరులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇమ్రాన్ వ్యాఖ్యానించినట్లు తెలిపింది. అయితే ఇలాంటి వారిని బహిరంగంగా ఉరితీయాలని కొందరు మంత్రులు సూచించిన ప్రతిపాదనకు ఇమ్రాన్ సుముఖంగా లేరని వ్యాఖ్యానించింది. రెండేళ్ల క్రితం లాహోర్‌లో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య, ఇటీవల ఓ మహిళపై సామూహిక లైంగికదాడి ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story