Pakistan: కెనడాలో అదృశ్యమవుతోన్న పాకిస్థానీ ఎయిర్‌ హోస్టెస్‌లు

Pakistan: కెనడాలో అదృశ్యమవుతోన్న పాకిస్థానీ ఎయిర్‌ హోస్టెస్‌లు
నోట్‌లో పీఐఏకు ధన్యవాదాలు

పాకిస్థాన్‌ ఎయిర్‌ హోస్టెస్‌లు కెనడాలో కనపడకుండా పోతున్నారు. తాజాగా కెనడాలో విమానం ల్యాండ్‌ అయ్యిన తర్వాత ఒక ఎయిర్‌ హోస్టెస్‌ రూమ్‌ నుంచి అదృశ్యమైంది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు ధన్యవాదాలు చెబుతూ ఒక నోట్‌ ఉంచింది. పీఐఏలో ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేస్తున్న మరియమ్‌ రజా సోమవారం ఇస్లామాబాద్‌ నుంచి టొరంటో చేరుకున్న విమానంలో విధులు నిర్వహించింది. అయితే ఆ విమానం తిరుగు ప్రయాణంలో ఆమె డ్యూటీకి హాజరుకాలేదు. దీంతో పాక్‌ విమాన అధికారులు అప్రమత్తమయ్యారు. మరియమ్ బస చేసిన రూమ్‌లో వెతికారు. పీఐఏ యూనిఫామ్‌తోపాటు థ్యాంక్యూ పేరుతో ఉన్న నోట్‌ను ఆ రూమ్‌లో గుర్తించారు. ఆమె ఉద్దేశపూర్వకంగా మాయమైనట్లు పీఐఏ అధికారులు గ్రహించారు. మరియం రజా గత పదిహేనేళ్లుగా పీఐఏలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, పాకిస్థాన్‌ ఎయిర్‌ హోస్టెస్‌లు కెనడాలో మాయం కావడం ఇదే తొలిసారి కాదు. చాలా కాలంగా ఈ ట్రెండ్‌ కొనసాగుతున్నది. 2022లో నలుగురు, 2023లో ఏడుగురు ఫ్లైట్‌ సిబ్బంది కెనడాలో మాయమయ్యారు. ఈ ఏడాది జనవరిలో పీఐఏ ఫ్లైట్ అటెండెంట్ ఫైజా ముఖ్తార్ కూడా కెనడాలో అదృశ్యమైంది. ఏడాది వ్యవధిలో తొమ్మిది మంది పాకిస్థాన్ ఎయిర్‌హోస్టెస్‌ అదృశ్యమయ్యారు. తాజాగా మరియమ్‌ రజా మాయమైంది. అదృశ్యమవుతున్న పీఐఏ ఎయిర్‌ హోస్టెస్‌లు కెనడాలో ఆశ్రయం పొంది అక్కడ స్థిరపడుతున్నట్లు తెలుస్తున్నది.

కెనడాలో ఆశ్రయం పొందే విధానం సరళంగా ఉండటంతోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు పీఐఏ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కెనడా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. విమానయాన సంస్థ వాదన ఇలా ఉన్నప్పటికీ.. సిబ్బందికి తక్కువ వేతనాలు, భవిష్యత్తుపై నెలకొన్న భయంతోనే కెనడా చేరుకున్న అనంతరం అదృశ్యమవుతున్నారని అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story