Pakistan Elections 2024: పాక్‌లో సార్వత్రిక ఎన్నికల వాయిదా

Pakistan Elections 2024:  పాక్‌లో సార్వత్రిక ఎన్నికల వాయిదా
భద్రతా కారణాల దృష్ట్యా ఎలక్షన్స్ వాయిదా తీర్మానాన్ని ఆమోదించిన పాక్ సెనేట్

పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడ్డాయి.ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున, భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పార్లమెంటు ఎగువ సభ శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు సెనెట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. సెనెటర్ దిలావర్ ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగీ, పీఎమ్ఎల్-ఎన్ సెనెటర్ అఫ్నన్ ఉల్లాహ్ దీన్ని వ్యతిరేకించారు.

ప్రజలకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తీర్మానంలో ప్రస్తావించారు. అన్ని ప్రాంతాల వారు ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు. పాక్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో బలొచిస్థాన్, ఖైబర్ ఫాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సుల్లో ఓటర్ల స్పందన తక్కువగా ఉండొచ్చని తీర్మానంలో అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా తీర్మానంలో ప్రస్తావించారు.

ఇటీవలి ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకుల భద్రతపై కూడా తీర్మానంలో ఆందోళన వ్యక్తమైంది. ప్రముఖ నాయకులకు ప్రమాదం పొంచి ఉందని అంతర్గత వ్యవహారాల శాఖ హెచ్చరికలను కూడా తీర్మానంలో పేర్కొన్నారు. ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా, బలొచిస్థాన్‌లో ఉగ్రదాడులు పెరిగిన వైనాన్నీ ప్రస్తావించారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలను నిర్వహించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని సెనెట్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా తీర్మానానికి మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు.

Tags

Read MoreRead Less
Next Story