Russia: రష్యా ప్రధాన భూభాగంపై మళ్లీ పేలుళ్లు

Russia: రష్యా ప్రధాన భూభాగంపై మళ్లీ పేలుళ్లు
కెర్చ్‌ వంతెనపై పేలుళ్లు , ఇద్దరు మృతి

రష్యా ప్రధాన భూభాగంపై మరోసారి భారీ పేలుళ్లు జరగడం సంచలనంగా మారింది. క్రిమియా ద్వీపకల్పానికి జీవనాడైన కెర్చ్‌ వంతెనపై మరోసారి భారీ పేలుళ్లు జరిగాయి. దీంతో ఈ వంతెనపై రాకపోకలను రష్యా నిలిపివేసింది. సోమవారం తెల్లవారుజామున ఈ పేలుళ్లు జరిగాయి. అత్యవసర పరిస్థితి కారణంగా ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేశామని క్రిమియా రిపబ్లిక్‌ అధ్యక్షుడు సెర్గీ అక్సోనోవ్‌ వెల్లడించారు. సోమవారం తెల్లవారు జామున కెర్చ్‌ వంతెనపై రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్లతో రష్యా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. చాలా మంది వంతెనపై చిక్కుకుపోయినట్లు సమాచారం. పేలుళ్ల వల్ల కనీసం ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా ధ్రువీకరించలేదు. తాజా పేలుళ్ల వల్ల క్రిమియా వంతెనలో కొంత భాగం దెబ్బతిన్నట్లు గ్రేజోన్‌ అనే వాగ్నర్‌ అనుకూల టెలిగ్రామ్‌ ఛానల్‌ పేర్కొంది. రష్యా వైపు నుంచి 145వ పిల్లర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. క్రిమియా వంతెన దెబ్బతిన్న విషయాన్ని రష్యా రవాణా శాఖ ధ్రువీకరించింది. క్రిమియా వంతెన రోడ్డు మార్గంలో కొంత భాగం దెబ్బతిందని టెలిగ్రామ్‌ ఛానల్‌లో పేర్కొంది.


క్రిమియాకు నిత్యావసరాల సరఫరాలో, యుద్ధ రంగంలోని రష్యా బలగాలకు ఆయుధాలను చేరవేయడంలో 19 కి.మీ. పొడవైన కెర్చ్‌ వంతెన ఎంతో ముఖ్యమైనది. రైళ్లు, వాహనాల రాకపోకల కోసం నిర్మించిన జంట వారధి ఐరోపాలోనే అత్యంత పొడవైనది. నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం తీవ్రంగా యత్నిస్తోన్న రష్యా.. 2014లో క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత సుమారు రూ.29వేల కోట్లు వెచ్చించి రోడ్డు, రైలు వంతెనను నిర్మించింది. 2018లో పుతిన్‌ స్వయంగా ట్రక్‌ నడిపి దీనిని ప్రారంభించడం విశేషం. గత అక్టోబర్‌లో పుతిన్‌ 70వ జన్మదిన వేడుకలు జరిగిన మరుసటి రోజే బ్రిడ్జిపై దాడి జరిగింది. అప్పట్లో ఉక్రెయిన్‌ అత్యాధునిక సముద్ర డ్రోన్‌లో పేలుడు పదార్థాలు నింపి ఈ వంతెన కింద పేల్చినట్లు తెలుస్తోంది. కొన్ని మైళ్ల దూరం నుంచి సెన్సర్లు, రిమోట్‌ సాయంతో అప్పట్లో ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story