Paris : రూల్స్ పాటించలేదని టీనేజర్లపై పోలీసుల కాల్పులు...

దేశమంతటా ఆందోళనలు, దర్యాప్తు కు ఆదేశించిన దేశాధ్యక్షులు

ప్రశాంతతకు పెట్టింది పేరైన ఫ్రాన్స్‌ ఒక్కసారిగా భగ్గుమంది. పారిస్‌ నగర శివారు లోని ట్రాఫిక్‌ స్టాప్‌ వద్ద పోలీసులు ఓ 17ఏళ్ల యువకుడిని కాల్చి చంపడంపై పారిస్‌తో సహా అన్ని ముఖ్యమైన పట్టణాలు నిరసనలతో హౌరెత్తాయి. పోలీస్‌ కాల్పుల్లో మరణించిన టీనేజర్‌ని నేల్‌ గా గుర్తించారు.

మంగళవారం తెల్లవారు జామున నేల్‌ అనే యువకుడు ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేయడంతో కారును ఆపాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అయితే అతను పట్టించుకోకుండా కారును ముందుకు తీసుకెళ్లడంతో పోలీసులు కాల్పులు జరిపారు. బులెట్లు ఛాతిలోకి దూసుకుపోయిన కొద్ది సేపటికే ఆ యువకుడు చనిపోయాడు. కుప్పకూలిన యువకుణ్ణి కాపాడేందుకు అత్యవసర సహాయక సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కారు డ్రైవర్‌ సీటులో ఉన్న నేల్‌పైకి అతి సమీపం నుంచి పోలీసులు కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను చూసిన ఫ్రాన్స్‌ ప్రజలు పోలీసుల మండిపడ్డారు.





నేల్‌ హత్యకు నిరసనగా పారిస్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల కార్లకు నిప్పంటించారు. బస్‌ స్టాప్‌లను ధ్వంసం చేశారు. పోలీసులపైకి పేలుడు సామాగ్రిని విసిరేశారు. దాంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గ్రెనెడ్లను ఉపయోగించారు.





నిరసనలు మరింతగా పెరగవచ్చన్న అనుమానం తో వేలాదిమంది పోలీసులను పారిస్ నగరంలో మోహరించారు. పోలీసుల వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. గతేడాది కాలంలో ట్రాఫిక్‌ స్టాప్‌ల వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో 13మంది చనిపోయారు. ఈ ఏడాదిలోనే ఇలాంటి సంఘటన ఇది రెండవది.

ఈ విషయం పై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ స్పందించారు. ఈ చర్య క్షమించరానిదన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, ప్రజలు శాంతంగా వుండాల్సిందిగా కోరారు. ప్రదర్శనల సందర్భంగా జరిగిన అల్లర్లకి సంబంధించి 31మందిని అరెస్టు చేశారు. ఈ ఘర్షణల్లో 25మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. మొత్తంగా 40కార్లు తగలబడ్డాయని చెప్పారు.కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story