ఫైజర్‌ టీకా సత్ఫలితాలు.. అమెరికాలో పంపిణీకీ చర్యలు

ఫైజర్‌ టీకా సత్ఫలితాలు.. అమెరికాలో పంపిణీకీ చర్యలు
ప్రజలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అమెరికా సిద్ధం అవుతోంది. ఫైజర్‌ టీకా సత్ఫలితాలిస్తోందని తేలడంతో పంపిణీ చర్యలకు సిద్ధమయ్యారు. ఆ మేరకు సన్నాహాలు..

ప్రజలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అమెరికా సిద్ధం అవుతోంది. ఫైజర్‌ టీకా సత్ఫలితాలిస్తోందని తేలడంతో పంపిణీ చర్యలకు సిద్ధమయ్యారు. ఆ మేరకు సన్నాహాలు చేపడుతున్నారు. వైట్‌ హౌస్‌లో వ్యాక్సిన్‌ సమన్వయం కోసం ఏర్పాటు చేసిన బృందానికి నేతృత్వం వహిస్తున్న మోన్సెఫ్‌ ఈ ప్రకటన చేశారు. డిసెంబరు కల్లా దాదాపు రెండు కోట్ల మందికి సరిపడా వ్యాక్సిన్‌ డోసుల్ని సిద్ధంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆ తర్వాత నెలకు 2 నుంచి 3 కోట్ల మందికి టీకా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. దీనికి సరిపడా డోసుల్ని తయారు చేసేందుకు ఆయా సంస్థల్ని సంసిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అయితే, అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతిస్తేనే ఇదంతా సాధ్యమవుతుందని తెలిపింది.

అమెరికాలో రోజుకి సగటున లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మోన్సెఫ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు అమెరికాలో కోటికి కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండున్నర లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అమెరికాలో ఆరు వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ, లైవ్‌ వైరల్‌ వెక్టార్స్‌, రీకాంబినెంట్‌ ప్రోటీన్‌ అనే మూడు రకాల సాంకేతికతతో తయారవుతున్నాయి. ఫైజర్‌ టీకా మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇదే విధానంలో రూపొందిస్తున్న మరో వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది విజయవంతమైతే.. తక్కువ సమయంలో మరిన్ని ఎక్కువ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.మోడెర్నా నుంచి కూడా వ్యాక్సిన్‌పై శుభవార్త వినే అవకాశం ఉందంటున్నారు ఈ వ్యాక్సిన్లన్నీ సమర్థమైనవని తేలిన వెంటనే.. వాటి ఉత్పత్తికి కావాల్సిన అన్ని చర్యల్ని తీసుకుంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story