PM Modi: అబుధాబీలో హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని

PM Modi: అబుధాబీలో హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని
యూఈఏ పై ప్రశంసలు కురిపించిన నరేంద్ర మోదీ

అరబ్‌ దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్‌ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు. అనంతరం మందిరంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందూవులు కలలు కన్న అయోధ్య రామ మందిర నిర్మాణం ఇటీవలే సాకారం అయ్యింది. ఈ నిర్మాణం కోసం కొన్ని దశాబ్దాల పాటు హిందువులు వేయ్యి కళ్లతో ఎదురు చూశారు. ఎంతో మంది ఈ నిర్మాణం కోసం పోరాటలు చేసినా… ఘనత మాత్రం ప్రధానికే దక్కుతుంది. అలానే తాజాగా మరో ఘనత మోదీ ఖాతాలో వేసుకున్నారు. యూఈఏలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.


27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయత, శిల్పకళ ఉట్టిపడేలా నిర్మితమైంది స్వామినారాయణ్‌ దేవాలయం. పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఇది. ఈ ఆలయం ఎత్తు 32.92 మీటర్లు, పొడవు 79.86 మీటర్లు, వెడల్పు 54.86 మీటర్లుగా ఉంది. దేవాలయానికి ఏడు గోపురాలున్నాయి. ఆలయ నిర్మాణంలో రాజస్థాన్‌ పాలరాయిని వాడారు.

అబూ మారెఖ్ ప్రాంతంలో 27 ఎకరాల స్థలంలో నగరశైలిలో మందిరం నిర్మాణం ఉంటుంది. ఇక్కడి ప్రార్థనా మందిరంలో ఒకేసారి మూడు వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కమ్యూనిటీ సెంటర్, చిన్న పిల్లల పార్కు వంటివి ఏర్పాటు చేశారు. సనాతన ధర్మంలోని ఎనిమిది గొప్ప లక్షణాలకు చిహ్నంగా దేవాలయ ముఖద్వారాలపై ఎనిమిది శిల్పాలు తీర్చిదిద్దారు. బుధవారం ఈ ఆలయాన్ని భారత‍ ప్రధానమంత్రి నరేం‍ద్రమోదీ ప్రారంభించారు. ఆలయంలో పూజారులతో కలిసి మోదీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూ దేవతలకు హారతి ఇచ్చారు.


ఆలయ ప్రారంభానికి విచ్చేసిన ప్రధాని మోదీని చూసేందుకు భారత పౌరులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యూఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయంగా ఇది గుర్తింపు పొందింది. ఇండియాతో యూఏఈ బలమైన బంధానికి, అలానే ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ ఆలయం నిలవనుంది. ఇక ఈ ఆలయ ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్ నటులు అక్షయ్‌ కుమార్‌, వివేక్‌ ఒబెరాయ్‌, మ్యూజిక్‌ కంపోజర్‌ శంకర్ మహదేవన్‌ హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story