Modi : ఫ్రాన్స్ కు బయలుదేరిన మోదీ

Modi : ఫ్రాన్స్ కు బయలుదేరిన మోదీ
బాస్టిల్ డే వేడుకల్లో గౌరవ అతిధిగా పాల్గొననున్న ప్రధాని

ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటన షురూ అయ్యింది. ఈ ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పారిస్ బయల్దేరారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అహ్వానం మేరకు 14న జరిగే బాస్టిల్ డే వేడుకల్లో మోడీ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు.

ఈ బాస్టిల్‌ డే పరేడ్‌లో భారత త్రివిధ దళాలకు చెందిన బృందం కూడా పాల్గొననుంది. మోడీని జులై14 పరేడ్‌కు స్వాగతించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. మేక్రాన్‌ ఇప్పటికే ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా మాక్రాన్‌ మోదీకి ఫ్రాన్స్‌ అధికార విందుతోపాటు ప్రత్యేక ఆతిథ్య విందు ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు విస్తృతస్థాయి అంశాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత ఫ్రాన్స్‌ సెనేట్ అధ్యక్షుడు మిస్టర్ గెరాడ్ లార్చర్‌ను కలుస్తారు ప్రధాని ఎలిసబెత్ బోర్న్‌తో సమావేశం అవుతారు. నేషనల్‌ అసెంబ్లీ అధ్యక్షులతోనూ మాట్లాడతారు. అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తలు, భారతీయ సీఈవోలు, అక్కడి ప్రముఖులను కలుస్తారు. ‘ఇండియా–ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల భిన్నరంగాల భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.


అలాగే నేవీ వేరియంట్‌ 26 రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుతోపాటు ఇరుదేశాలు సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను భారత్‌లో తయారుచేసే ఒప్పందం ఈ సమయం ఖరారుకావచ్చని అని విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పారు. ఫ్రాన్స్‌ గణతంత్ర వేడుకలుగా భావించే బాస్టిల్‌ డే కవాతులో పాల్గొనేందుకు ఇప్పటికే 269 మంది సభ్యుల త్రివిధ దళ బృందం సీ–17 గ్లోబ్‌మాస్టర్‌ యుద్ధసరుకు రవాణా విమానంలో పారిస్‌కు చేరుకుంది. ఛాంప్స్‌ ఎలీసెస్‌ చారిత్రక ప్రాంత గగనతలంలో ఫ్రెంచ్‌ యుద్ధవిమానాలకు తోడు భారత రాఫెల్‌ ఫైటర్‌జెట్‌లు ఫ్లైపాస్ట్‌లో పాల్గొననున్నాయి.

ఫ్రాన్స్‌ పర్యటన తర్వాత తిరుగుప్రయాణంలో జూలై 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షులు, అబుదాబీ పాలకుడు అయిన షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌తో మోదీ భేటీ కానున్నారు. సంస్కృతి, ఇంధనం, ఆహార భద్రత, రక్షణ, ఫిన్‌టెక్, విద్య, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవడంపై ఇరుదేశాధినేతలు చర్చించనున్నారు. ‘కాప్‌–28కు యూఏఈ, జీ20కి భారత్‌ సారథ్యం వహిస్తున్న ఈ తరుణంలో అగ్రనేతలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చలు జరపనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story