Pm Modi : కింగ్‌ చార్లెస్‌ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ

Pm Modi : కింగ్‌ చార్లెస్‌ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ
క్యాన్సర్‌‌ బారిన పడిన బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ 3

చార్లెస్‌-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సైతం కింగ్‌ చార్లెస్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ 3 క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కింగ్ చార్లెస్‌కు పరీక్షలు నిర్వహించగా.. ఆ వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది..అయితే, కింగ్ చార్లెస్ ఏ క్యాన్సర్‌తో బాధపడుతున్నారో అధికారికంగా చెప్పనప్పటికీ 75 ఏళ్ల రాజు ఛార్లెస్ 3 సాధారణ చికిత్స తీసుకుంటున్నట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పింది.

కింగ్‌ చార్లెస్‌కు క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు బ్రిటన్‌ రాజకుటుంబం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని.. రాజుకు ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వైద్య పరీక్షల్లో వ్యాధి బయటపడినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడించలేదు. ఆయన సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది.


75 ఏండ్ల చార్లెస్‌-3 తన తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణంతో 2022, సెప్టెంబర్‌ 8న రాజుగా బాధ్యతలు చేపట్టారు. 2023, మే 6న పట్టాభిషేకం చేశారు. కాగా, క్యాన్సర్ సమస్యపై అవగాహన పెంచడం కోసమే ఆయన తన చికిత్స గురించి బయటకు వెల్లడించారని కింగ్ చార్లెస్ ప్రతినిధి తెలియజేశారు. ప్రస్తుతం ‘ఔట్‌డోర్ పేషంట్’గా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కాగా, కింగ్ చార్లెస్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారని, త్వరలో తన రాజ బాధ్యతలను తిరిగి ప్రారంభిస్తారని రాజకుటుంబ ప్రతినిధి తెలిపారు. అయితే, ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. “కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అతను ఏ సమయంలోనైనా పూర్తి శక్తితో తిరిగి వస్తాడనడంలో నాకు ఎటువంటి సందేహం లేదంటూ రిషి రాసుకొచ్చారు. బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ సోషల్ మీడియా వేదికగా, “లేబర్ పార్టీ తరుఫున కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము” అని రాశారు. అతను పూర్తిగా ఫిట్‌గా తిరిగి రావాలని ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story