Putin: అరెస్ట్ భయంతోనేనా...

Putin: అరెస్ట్ భయంతోనేనా...
బ్రిక్స్‌ సదస్సుకు పుతిన్‌ హాజరు కావడం లేదని ప్రకటించిన రష్యా

జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరు కావడం లేదని దక్షిణాఫ్రికా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై పుతిన్ చర్యల కారణంగా ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గత మార్చిలో అరెస్టు వారెంటు జారీ చేసింది. పుతిన్‌ బ్రిక్స్ సదస్సుకు వస్తే ఆయనను దక్షిణాఫ్రికా అరెస్టు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రష్యా అధినేత బ్రిక్స్‌ సదస్సుకు హాజరు కావడం లేదన్న వార్తలు వస్తున్నాయి. పుతిన్ స్థానంలో ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ సదస్సులో పాల్గొంటారని మాస్కో తెలిపిందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా వెల్లడించారు.

ఆగస్టు 22-24 తేదీల్లో జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగే బ్రిక్స్‌ దేశాల సదస్సుకు హాజరవుతానని పుతిన్‌ ఇటీవల పేర్కొన్నారు. ఒకవేళ పుతిన్‌ అక్కడకు వెళ్తే ఐసీసీ సభ్య దేశంగా ఉన్న దక్షిణాఫ్రికా.. ఆయన్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పుతిన్‌ను అక్కడ అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధాన్ని ప్రకటించినట్లే అవుతుందని గతంలో రష్యా చెప్పిన మాటలను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా గుర్తుచేశారు. ఇలా ఓవైపు ఐసీసీ ఆదేశాలు, మరోవైపు రష్యా ప్రకటనతో దక్షిణాఫ్రికా తీవ్ర ఆలోచనలో పడింది. ఇదే విషయమై ఇటీవల పుతిన్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో చివరకు తమ సూచనతో రష్యా అధ్యక్షుడు పర్యటన రద్దు చేసుకున్నారని దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.

పుతిన్‌ను బ్రిక్స్ సదస్సుకు హాజరుకావద్దంటూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస మంగళవారంనాడు కోరారు. ఆ మరుసటి రోజే పుతిన్ రావడం లేదంటూ దక్షిణాఫ్రికా ప్రకటించడం విశేషం. ఉక్రెయిన్‌ నుంచి పిల్లల అహరణకు సంబంధించిన యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంటు జారీ చేసినందున ఆయన జోహానెస్‌బర్గ్ వస్తే కోర్టు ఆదేశాలను దక్షిణాఫ్రికా పాటించక తప్పనిసరి అవుతుంది. అదే జరిగితే రష్యాతో యుద్ధాన్ని ప్రకటించినట్టే అవుతుందని దక్షిణాఫ్రికా ఆందోళన చెందుతోంది. రష్యాతో యుద్ధం అనేది దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని కూడా చెబుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యాతో శాంతి యత్నాలు తాము జరుపుతున్నామని, అలాంటప్పుడు ఆయనను అరెస్టు చేయాల్సి వస్తే తమ శాంతి యత్నాలకు భంగం వాటిల్లుతుందని అంటోంది. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా భాగస్వాములుగా ఉన్నాయి.

మరోవైపు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వారెంట్‌తో ఏ దేశమైనా తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే, వారిపై యుద్ధం ప్రకటిస్తామని నాటో, ఐరోపా కూటమిని రష్యా హెచ్చరించింది. తమ దేశంలోకి అడుగుపెడితే రష్యా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుంటామని ఇటీవల జర్మనీ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో రష్యా భద్రతా మండలి ఉపకార్యదర్శి దిమిత్రి మెద్వ్‌దెవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ను అరెస్టు చేయాలన్న ఊహ ఎప్పటికీ వాస్తవమవ్వదని, ఒకవేళ జర్మనీ పుతిన్‌ను అరెస్ట్‌ చేస్తే అది రష్యా సమాఖ్యపై యుద్ధం ప్రకటించడమే. తక్షణమే మా క్షిపణులు, మిగతా ఆయుధాలన్నీ జర్మనీ ఛాన్సలర్‌ కార్యాలయంవైపు దూసుకుపోతాయని మెద్వ్‌దెవ్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలు పంపిస్తున్న కొద్దీ అణు యుద్ధం ముప్పు పెరుగుతూనే ఉంటుందని రష్యా హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story