Putin : తిరుగుబాటు తరువాత ప్రీగోజిన్ పుతిన్ భేటీ

Putin : తిరుగుబాటు తరువాత ప్రీగోజిన్ పుతిన్ భేటీ
సమావేశంలో పాల్గొన్న 35 మంది వార్నర్ గ్రూప్ కమాండర్లు

రష్యాపై తిరుగుబాటు ప్రయత్నం చేసిన వాగ్నర్‌ గ్రూపు అధినేత ప్రిగోజిన్‌తో పుతిన్‌ స్వయంగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ సోమవారం తెలిపారు. జూన్‌ 29న క్రెమ్లిన్‌లో మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రిగోజిన్‌తో పాటు వాగ్నర్‌ గ్రూపుకు చెందిన 35 మంది కమాండర్లు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో మధ్యవర్తిత్వం వహించిన ఈ సమావేశంలో జూన్‌ 24న తిరుగుబాటుకు గల కారణాలను వాగ్నర్‌ గ్రూపు కమాండర్లు పుతిన్‌కు వివరించినట్లు చెప్పారు. తిరుగుబాటు ప్రకటించిన రోజు జరిగిన ఘటనల గురించి చర్చించారన్నారు. అయితే అధ్యక్షుడిని టార్గెట్ గా పెట్టుకుని తిరుగుబాటు చేయలేదని, రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ, మిలిటరీ చీఫ్ జనరల్ వాలెరి గెరాసిమూవ్ లను తొలగించాలనే ఈ ప్రయత్నం చేసినట్టు చెప్పినట్లుగా సమాచారం. కమాండర్ల వివరణను విన్న పుతిన్‌ యుద్ధంలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి వారికి కొన్ని సూచనలు చేసినట్లు తెలిపారు. రష్యా తరఫున పోరాటం చేసేందుకు తమ అధినేతతో పాటు తాము, తమ సైనికులు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వాగ్నర్‌ గ్రూపు కమాండర్లు పుతిన్‌కు హామీ ఇచ్చినట్లు దిమిత్రి తెలిపారు.




పుతిన్‌ ప్రైవేటు సైన్యమైన వాగ్నర్‌ గ్రూపు జూన్‌ 24న రష్యా అధినేతపైనే తిరుగుబాటుకు యత్నించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే పుతిన్‌ – ప్రిగోజిన్‌ల మధ్య బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో మధ్యవర్తిత్వం వహించి సంక్షోభాన్ని నివారించారు. ఈ పరిణామాలు జరిగిన ఐదు రోజుల తర్వాత జూన్‌ 29న పుతిన్‌, ప్రిగోజిన్‌ సమావేశమై దాదాపు మూడు గంటల పాటు చర్చించారని తెలిపారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న వాగ్నర్‌ గ్రూపు తిరుగుబాటు ప్రయత్నంలో భాగంగా ఓ రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది. అక్కడ యుద్ధ ట్యాంకులు సహా సైనిక వాహనాలు తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తాము చేస్తున్నది న్యాయం కోసం పోరాటమేనని, తిరుగుబాటు కాదని ప్రిగోజిన్‌ అప్పట్లోనే ఒక వీడియో రిలీజ్ చేశారు. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అయితే చివరకు వెనక్కి తగ్గిన వాగ్నర్‌ చీఫ్‌ రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాలను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించినట్లు ప్రకటించడంతో తిరుగుబాటు యత్నానికి బ్రేక్‌ పడినట్లయ్యింది. ఇప్పుడు మళ్లీ పుతిన్ తో రహస్య భేటీ జరపడం కీలక పరిణామం అని భావించవచ్చు. ఇకపై అటు వార్నర్ గ్రూప్ గానీ, ఇటు పుతిన్ గానీ ఇరువైపుల నుంచి ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story