PUTIN: ఏం మా దగ్గర లేవా బాంబులు...

PUTIN: ఏం మా దగ్గర లేవా బాంబులు...
ఉక్రెయిన్ కు పుతిన్ హెచ్చరిక

ప్రపంచ దేశాలకు పుతిన్‌ మరోసారి హెచ్చరికలు పంపారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని అమెరికా సహా పశ్చిమ దేశాలకు తేల్చి చెప్పారు. ఈ హెచ్చరికలు మరోసారి ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేశాయి. ఉక్రెయిన్‌కు అమెరికా అత్యంత ప్రమాదకర క్లస్టర్‌ బాంబులు సరఫరా చేయడంపై పుతిన్‌ తీవ్రంగా మండిపడ్డారు. మాస్కో ఆయుధాగారంలో కూడా భారీ సంఖ్యలో క్లస్టర్‌ ఆయుధ నిల్వలున్నాయని... ఆ విషయాన్ని తెలుసుకోవాలంటూ హెచ్చరించారు. ఇన్ని రోజుల యుద్ధంలో తమకు చాలా సార్లు ఆయుధ కొరత ఎదురైందనీ అయినా ఎప్పుడూ క్లస్టర్‌ వెపన్స్‌ను ప్రయోగించలేదని చెప్పారు. ఎవరైనా క్లస్టర్‌ ఆయుధాలను రష్యన్‌లపై ప్రయోగిస్తే తామూ వాటితోనే బదులిస్తామనీ అందుకు తమకు పూర్తి హక్కు ఉందని తెలిపారు. ఈ వివాదాస్పద ఆయుధాలను ఉక్రెయిన్‌ వాడిన పక్షంలో తగు రీతిలో స్పందించే హక్కు తమకుందని హెచ్చరించారు.


ఈ సందర్భంగా అమెరికా ఆయుధ వ్యవస్థపై మాస్కోధీషుడు తీవ్ర విమర్శలు చేశారు. అగ్రరాజ్యంలో ఆయుధ కొరత ఉందని వ్యాఖ్యానించారు. గత్యంతరం లేక.. వేరే ఆయుధాలు సరఫరా చేయలేక.. క్లస్టర్‌ ఆయుధాలను సరఫరా చేసిందని ఆరోపించారు. యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం 155 క్యాలిబర్‌ తూటాలు రోజుకు 6వేల వరకు అవసరం అవుతున్నాయనీ అమెరికా నెలకు 15వేల తూటాలను మాత్రమే ఉత్పత్తి చేయగలదన్నారు. మరోవైపు యుద్ధ భూమిలో అతి భారీ స్థాయి విధ్వంసం సృష్టించే క్లస్టర్‌ ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరినట్లు పెంటగాన్‌ ధ్రువీకరించింది. రష్యా దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా వీటిని కీవ్‌కు సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది..

యుద్ధక్షేత్రంలో రష్యా ఆర్మీపై ఉక్రెయిన్‌ పైచేయి సాధించాలంటే విధ్వంసకర క్లస్టర్‌ బాంబులే మార్గమని అమెరికా అంచనా వేస్తోంది. క్లస్టర్‌ బాంబుల సరఫరాపై నెలలపాటు అమెరికా మల్లగుల్లాలు పడింది. ఉక్రెయిన్‌కు వీటిని అందజేయాలన్న నిర్ణయానికే అధ్యక్షుడు బైడెన్‌ చివరికి మొగ్గు చూపారు. ప్రమాదకరమైనవిగా భావించే క్లస్టర్‌ బాంబులను చివరిసారిగా అమెరికా 2003లో ఇరాక్‌ యుద్ధంలో వాడినట్లు చెబుతోంది. ప్రస్తుతం అమెరికా వద్ద 30 లక్షల క్టస్టర్‌ ఆయుధ నిల్వలున్నాయి. డొనెట్‌స్క్, ఖెర్సన్‌ ప్రాంతాలే లక్ష్యంగా గత 24 గంటల్లో రష్యా రెండు షహీద్‌ డ్రోన్లను, రెండు క్రూయిజ్‌ మిస్సైళ్లను, రెండు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సైళ్లతోపాటు 40 వైమానిక దాడులు, 46 రాకెట్‌ దాడులు జరిపిందని ఉక్రెయిన్‌ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story