Ayodhya Temple: టైమ్స్‌ స్క్వేర్‌లో అయోధ్య లైవ్

Ayodhya Temple: టైమ్స్‌ స్క్వేర్‌లో అయోధ్య లైవ్
న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం

అయోధ్యలో ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరుగనున్న రామ మందిర ప్రారంభోత్సవం న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్‌ స్కేర్‌ వద్ద ప్రత్యక్ష ప్రసారం(లైవ్‌ స్ట్రీమింగ్‌) కానున్నట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎదురుచూస్తున్న రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వివిధ భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కూడా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని నివేదించాయి.

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమానికి రామజన్మభూమి ట్రస్ట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. విదేశాల్లో ఉన్న రామ భక్తులు, భారతీయులు సైతం ఈ శుభ ఘట్టాన్ని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం విదేశాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది.

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతదేశం, రామభక్తులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. దేశంలోని గ్రామ స్థాయిలో కూడా అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రామ భక్తులు ఇప్పటికే అన్ని సన్నాహాలు చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ప్రసారం చేయాలని బీజేపీ పార్టీ కార్యకర్తలకు సూచించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, వేడుకలను ప్రధాని మోడీ పర్యవేక్షిస్తున్నారు. రామమందిర నిర్మాణ సమితి అధినేత నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ, రామ్‌లల్లా ప్రతిస్థ సందర్భంగా అనుసరించాల్సిన అన్ని చర్యల గురించి చెప్పారు.


పాత రామ విగ్రహం, కొత్త రామ విగ్రహం రెండూ గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు. పాత రామ విగ్రహాన్ని ఉత్సవ రాముడిగా పిలుస్తారు. రెండు విగ్రహాలను కొత్త రామమందిరంలో ఉంచుతామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. వందలాది ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకుల సాయంతో అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాలను అతిథులందరికీ స్వయంగా అందిస్తున్నట్టు అయోధ్య రామాలయ ట్రస్ట్‌ అధికార వర్గాలు తెలిపాయి. ఆలయ ట్రస్ట్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విదేశాల్లోని అతిథులకు సైతం స్వయంగా ఆహ్వానాలను అందిస్తున్నారు. బూత్ స్థాయిలో శ్రీరామ ప్రతిష్ఠ (Ram Mandir consecration) ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని పార్టీ కార్యకర్తలకు బీజేపీ సూచించింది. అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా వీక్షించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు బీజేపీ తెలిపింది. అంతేకాకుండా, జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రాకుండా, ఈ భారీ స్క్రీన్ లపై వారి ఊర్లలోనే ఆ కార్యక్రమాన్ని వీక్షించేలా చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story