India-Canda: మరో కొత్త నాటకానికి తెరలేపిన కెనడా

India-Canda:  మరో కొత్త నాటకానికి తెరలేపిన కెనడా
స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన భారత్

భారత్ , కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు మళ్లీ వేడెక్కాయి. భారత్‌లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నామని అధికారిక ప్రకటన చేసిన కెనడా ఇదే అవకాశంగా .. ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్.. కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇండియాలోని దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యాలను చూశామని ఇక్కడ కెనడాకు చెందిన దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక మన అంతర్గత విషయాల్లో వాళ్లు తరచుగా జోక్యం చేసుకుంటున్నారని.. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని తెలిపింది.

భారత్‌లో దౌత్య సిబ్బందిని తగ్గించడంపై అధికారిక ప్రకటన చేసిన కెనడా.. న్యూఢిల్లీ అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ అక్కసు వెళ్లగక్కింది. ఈ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కెనడాకు దీటుగా బదులిచ్చింది. చట్టాలకు అనుగుణంగానే తాము కెనడాకు దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని సూచించినట్లు స్పష్టం చేసింది. భారత్‌లోని 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి రప్పించామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ శుక్రవారం ఉదయం చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించారు.ఈ సందర్భంగా భారత్‌పై ఆమె మరోసారి ఆరోపణలు చేశారు. ‘భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించకపోతే అదనంగా ఉన్న వారికి దౌత్యపరమైన రక్షణలు ఎత్తివేస్తామని ఢిల్లీ అల్టిమేటం ఇచ్చింది. ఇది అసమంజసం, అనూహ్య నిర్ణయం. దౌత్య సంబంధాల కోసం ఏర్పాటు చేసుకున్న వియన్నా ఒప్పందాన్ని ఢిల్లీ ఉల్లంఘించింది’ అని మోలానీ ఆరోపించారు.

దాంతో భారత విదేశాంగ శాఖ కెనడా ఆరోపణలను తిప్పికొడుతూ శుక్రవారమే ఓ ప్రకటన చేసింది. దీని గురించి గత నెల రోజులుగా కెనడాతో చర్చలు జరిపాం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 11.1 నిబంధనలకు అనుగుణంగానే దౌత్య సిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు మేం చర్యలు తీసుకున్నాం. సమానత్వ అమలును నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. మరోవైపు భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన వేళ అగ్రరాజ్యం అమెరికా కెనడాకు మద్దతుగా నిలిచింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య తగ్గించాలంటూ ఒత్తిడి చేయొద్దని అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story