War: అజర్​బైజాన్​, అర్మేనియా మధ్య కాల్పుల విరమణ

War: అజర్​బైజాన్​, అర్మేనియా మధ్య కాల్పుల విరమణ
రష్యా మధ్యవర్తిత్వంతో ఒప్పందం

గత రెండు రోజులుగా అజర్‌బైజన్‌, అర్మేనియా మధ్య వివాదాస్పద ప్రాంతం నాగర్నో-కారబఖ్‌లో జరుగుతున్నా భీకర దాడులకు ఎట్టకేలకు తెర పడింది. యుద్ధాన్ని ముగించేందుకు అజర్‌బైజన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదూర్చుకున్నట్టు అర్మేనియన్ వర్గాలు వెల్లడించాయి. నాగర్నో-కారబఖ్ ప్రాంతంలోని రష్యా శాంతి పరిరక్షక బృందంతో చర్చల ద్వారా ఈ ఒప్పందం కుదిరింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ దాడుల్లో వంద మందికి పైగా మృతి చెందారు.

రష్యా శాంతి పరిరక్షక బృందంతో చర్చల ద్వారా కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా నాగర్నో-కారబఖ్ నుంచి అర్మేనియన్ సైనిక దళాలు,సామగ్రిని ఉపసంహరించుకోవడం సహా స్థానిక రక్షణ దళాలను నిరాయుధులను చేయడం వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాగర్నో-కారబఖ్ ప్రాంతంలో అజర్‌బైజన్‌ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 100 మంది మరణించారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్నో-కారబఖ్‌ నుంచి అర్మేనియన్లను వెళ్లగొట్టేందుకు ఈ దాడులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.అయితే అజర్‌బైజన్‌ మాత్రం దీనిని ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌గా చెబుతోంది. అక్కడ ఉన్న అర్మేనియన్‌ జాతీయుల హక్కులను రక్షించేందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టామని చెబుతోంది.


అర్మేనియన్‌ ప్రజల హక్కులను రక్షించడానికే ఈ దాడులను చేస్తున్నట్లు పేర్కొంది. నాగర్నో- కరబఖ్‌ ప్రాంతం భౌగోళికంగా అజర్‌బైజన్‌ దేశంలో ఉంది. అయితే అజర్‌బైజన్‌‌ను వ్యతిరేకించే ఆర్మేనియా సైన్యం 1994 నుంచి నాగర్నో- కరబఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇరు దేశాల మధ్య తరుచూ కాల్పులు జరగడం ఇక్కడ పరిపాటిగా మారింది. రష్యాకు చెందిన శాంతి పరిరక్షక దళాలు ఇక్కడి నుంచి 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.


అజర్‌బైజన్‌,అర్మేనియా మధ్య కాల్పుల విరమణ జరగక ముందు వరకు నాగర్నో-కారబఖ్ ప్రాంతంలోని స్థానికులు నివాస బేస్‌మెంట్లు,బాంబ్‌ షెల్టర్లలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకున్నారు.బాంబు దాడుల వల్ల విద్యుత్తు నిలిచిపోవడంతో రెండు రోజులుగా చీకట్లోనే ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.పలు భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.ఈ ఘర్షణల్లో గాయపడిన వారికి శాంతి పరిరక్షణ దళాలు తక్షణమే వైద్యసాయం అందించాలని రష్యా విదేశీ వ్యవహారాలశాఖ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story