Russia-Ukraine War: రష్యాపై దాడి చేసిన ఉక్రెయిన్‌..

Russia-Ukraine War:  రష్యాపై దాడి చేసిన ఉక్రెయిన్‌..
క్షిపణి దాడిలో రష్యా నౌక ధ్వంసం..

కొన్నాళ్లుగా అడపాదడపా దాడులు చేసుకున్న రష్యా-ఉక్రెయిన్ మరోసారి భీకర పోరుకు దిగాయి. ఉక్రెయిన్‌లోని మరో ఊరిని స్వాధీనం చేస్తుకున్నామని రష్యా ప్రకటించగా నల్ల సముద్రంలో రష్యాకు చెందిన యుద్ధ నౌకపై వైమానిక దాడులు చేశామని కీవ్‌ పేర్కొంది. ఇరు దేశాల మధ్య మరోసారి భీకర యుద్ధ భయాందోళనలు నెలకొన్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భీకర రూపు దాల్చింది. ఉక్రెయిన్‌లోని మరింకా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా పేర్కొంది. దొనెత్క్స్‌కి 20 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉందని తెలిపింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఒక ప్రకటన విడుదల చేశారు. మాస్కో సేనలు మరింకా పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను రష్యాకు చెందిన ప్రభుత్వం ఛానెల్ ప్రసారం చేసింది. రష్యా దాడులు ధాటికి మరింకాలో ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పట్టణమంతా శిథిలాల గుట్టగా మారింది. ఈ పట్టణం కోసం ఇది వరకే ఇరు దేశాలు భీకర దాడులు చేసుకోగా....తాజాగా ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే ఉక్రెయిన్‌, మాస్కో ప్రకటనపై స్పందించలేదు.

మరోవైపు క్రిమియాలో రష్యాకు చెందిన యుద్ధ నౌకపై క్షిపణి దాడులు చేశామని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ దాడిలో నౌక భారీగానే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. క్షిపణులు నౌకపై విరుచుకపడ్డగానే పోర్టు ప్రాంతమంతా నారింజ రంగులోకి మారిపోయింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు క్రిమియా గవర్నర్ తెలిపారు. ఆరు భవనాలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. పోర్టులో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ దాడిని రష్యా కూడా ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌కు చెందిన రెండు ఫైటర్‌ జెట్లను తమ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్షిపణులు నెలకూల్చాయని తెలిపింది. అయితే రష్యా ప్రకటనను ఉక్రెయిన్ ఖండించింది. తమ ఫైటర్‌ జెట్లపై ఎలాంటి దాడి జరగలేదని ఉక్రెయిన్ వైమానిక అధికార ప్రతినిధి తెలిపారు

Tags

Read MoreRead Less
Next Story