వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. 11 మంది వృద్ధులు సజీవదహనం

వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. 11 మంది వృద్ధులు సజీవదహనం
అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటల్ని ఆర్పారు

ఇల్లు కంటే ఆశ్రమం సురక్షితమని భావించారు. అక్కడ తమ వయసు వాళ్లు చాలా మంది ఉన్నారని సంతోషించారు. కబుర్లు, కాలక్షేపాలతో జీవితం సాగిపోతోంది. అర్థరాత్రి అయింది ముచ్చట్లాపి పడుకోండని వార్డెన్ వారించడంతో అందరూ ముసుగు పెట్టి పడుకున్నారు. అంతలోనే ఎగసి పడుతున్న అగ్నికీలల్లో వాళ్లంతా చిక్కుకున్నారు. హోమ్‌లో ఉన్న15 మందిలో 11 మంది సజీవదహనం అయ్యారు. రష్యాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బాష్‌కోర్డొస్టాన్ ప్రాంతంలోని ఉరల్ పర్వతశ్రేణుల్లోని ఇష్బుల్డినో గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకు ఓ రిటైర్మెంట్ హోమ్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అత్యవసర మంత్రిత్వ శాఖ పేర్కొంది. తెల్లవారుజామున 3 గంటలకు రిటైర్డ్ హోమ్‌లో వ్యాపించిన మంటలు సుమారు మూడు గంటల పాటు ఏకధాటిగా ఎగసిపడ్డాయి. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటల్ని ఆర్పారు.

హోమ్‌లోని వారంతా వృద్ధులు కావడంతో అగ్ని ప్రమాదం నుంచి త్వరగా బయటపడలేకపోయారు. దీంతో వారంతా మంటల్లో సజీవ దహనం అయ్యారు. నలుగురు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు రష్యా ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఘటన పట్ల విచారణ మొదలు పెట్టినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ప్రమాదానకి గల కారణాలను విచారిస్తోంది. రష్యా ప్రభుత్వం ఓ కమిటీని వేసి త్వరలో సమాచారాన్ని తమకు అందజేయాలని అధికారులను ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story