Russia plane crash: కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 74 మంది మృతి

Russia plane crash:  కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 74 మంది మృతి
మృతులు 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు సహా, ఆరుగురు సిబ్బంది, ముగ్గురు వ్యక్తులు

ఉక్రెయిన్ సరిహద్దులో ఓ రష్యా మిలిటరీ రవాణా విమానం (ఐఎల్-76) కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు సహా, ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని రష్యా రక్షణశాఖ బుధవారం ప్రకటించింది. ప్రమాద ఘటన ఉక్రెయిన్‌ సరిహద్దు బెల్గోరాడ్‌లోని కోరోఛాన్సీ జిల్లాలో చోటుచేసుకుందని ఆ రాష్ట్ర గవర్నర్‌ వ్యాచిస్లేవ్‌ గ్లాడ్‌కోవ్‌ మీడియాకు తెలిపారు. ఘటన వెనక కారణాలను వెలికి తీసేందుకు ప్రత్యేక మిలిటరీ కమిషన్‌ ఘటనా స్థలానికి బయలుదేరినట్టు చెప్పారు.

ప్రమాదానికి దారి తీసిన కారణాలు ఆయన వెల్లడించలేదు. ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలను బెల్గోరాడ్‌కు తరలిస్తుండగా విమానం ప్రమాదానికి గురైందని రష్యా అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ సైనిక బలగాలే తమ విమానాన్ని కూల్చేశాయని రష్యా రక్షణశాఖ ఆరోపించింది. ఉక్రెయిన్‌ ఆధీనంలోని ఖార్కీవ్‌ నుంచి బెల్గోరాడ్‌ ప్రాంతంపైకి రెండు క్షిపణుల్ని ఉక్రెయిన్‌ బలగాలు ప్రయోగించాయని, దాడులు జరిగినట్టు తమ రాడార్లు గుర్తించాయని రష్యా తెలిపింది. క్షిపణి దాడులను తీవ్రవాద చర్యగా పేర్కొన్నది.

ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకస్మాత్తుగా అదుపుకోల్పోయిన విమానం వేగంగా కిందకి పడిపోతున్నట్టు ఈ వీడియోల్లో కనిపించింది. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా నేలను ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

కుప్పకూలిన విమానంలో యుద్ధ ఖైదీలున్నారన్న విషయాన్ని అంతర్జాతీయ మీడియా ఖరారు చేయలేదు. ఇరు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి వంటిదేదీ లేదని ఉక్రెయిన్‌ అధికారిక వర్గాలు చెప్పటంతో, దుర్ఘటనపై రష్యా చేసిన ప్రకటన పలు అనుమానాలకు తావిచ్చింది. విమానం కూలిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి ముందు విమానం అదుపు తప్పి కిందకు పడిపోయినట్టు కనిపించింది.

నేలను తాకే ముందు విమానం పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ‘ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌ క్షిపణి దాడులు జరపవచ్చు. పౌరులెవ్వరూ ఇండ్లల్లో నుంచి బయటకు రావొద్దు’ అని బెల్గోరాడ్‌ గవర్నర్‌ వ్యాచిస్లేవ్‌ గ్లాడ్‌కోవ్‌ ప్రకటించిన కొద్ది గంటల్లో సైనిక విమానం కుప్పకూలటం సంచలనంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story