MOON: భారత్‌కు పోటీగా రేపే చంద్రుడి మీదకు రష్యా

MOON: భారత్‌కు పోటీగా రేపే చంద్రుడి మీదకు రష్యా
చంద్రయాన్‌-3కు పోటీగా చంద్రుడి దక్షిణ ధ్రువానికి లూనా-25.... తొలి దేశంగా నిలవాలన్న ఇస్రో ఆశలకు గండి?

ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌకా చేరుకోని చంద్రుని దక్షిణ ధ్రువం( lunar south pole ) ప్రాంతానికి చేరుకుని( Chandrayaan-3 mission) చరిత్ర సృష్టించాలని ఇస్రో భావిస్తోంది. అయితే భారత్‌ కన్నా ముందే ఆ ఘనత సాధించేందుకు రష్యా సిద్ధమైంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత(first moon-landing spacecraft ) చంద్రుడిపైకి మళ్లీ ల్యాండర్‌ను పంపించేందుకు రష్యా సిద్ధమైంది. రేపు(ఆగస్టు 11న) ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌(Roscosmos) ఈ ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్‌-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఆగస్ట 23న ల్యాండ్‌కానుండగా అంతకంటే ముందే రష్యా పంపే లూనా-25(Russia’s Luna-25 mission) అక్కడే అడుగుపెట్టనుంది.


దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మళ్లీ ల్యాండర్‌ను పంపించేందుకు రష్యా సిద్ధమైంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేయాలని రష్యా భావిస్తోంది. ఈ నెల 11న రష్యా ప్రయోగించనున్న లూనా-25 కేవలం ఐదు రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత మరో ఐదు లేదా ఏడు రోజుల్లో జాబిల్లిపై ల్యాండింగ్ కూడా చేసేలా రష్యా ప్రణాళిక సిద్ధం చేసింది. దీని వల్ల ఇస్రో నిర్ణయించుకున్న ఆగస్టు 23 తేదీ లేదా అంతకంటే ముందుగానే చంద్రుని దక్షిణ ధ్రువంపై రష్యా ల్యాండర్‌ను దించేందుకు రష్యా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3కి మాత్రం జాబిల్లిపై దిగేందుకు 41 రోజుల సమయం పడుతోంది.


ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌకా చేరని జాబిల్లి దక్షిణ ధ్రువంలో గణనీయమైన పరిమాణంలో మంచు ఉంటుందనీ భావిస్తున్న శాస్త్రవేత్తలు అక్కడ ల్యాండింగ్ సవ్యంగా జరిగితే. ఆక్సిజన్‌, ఇంధనం, నీరు వంటి వనరులపై సమాచారం సేకరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రష్యా పంపనున్న లూనా-25 దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23 లేదా అంతకన్నా ముందే దిగితే అక్కడ అడుగుపెట్టిన తొలిదేశంగా రష్యా చరిత్ర సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్రయాన్-3(Chandrayaan-3) ఆగస్టు 23 సాయంత్రం 5 గం టల 47 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.మరి ఈ రెండు ఒకేసారి చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ కావడం వల్ల పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై రష్యా స్పష్టతనిచ్చింది. రెండు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు ల్యాండింగ్ చేయాలనుకున్న ప్రాంతాలు వేరని తెలిపింది. అంతేకాకుండా ల్యాండింగ్ క్రమంలో చంద్రయాన్-3, లూనా-25 పరస్పరం ఢీకొనే ప్రమాదం లేదని వివరించింది. చంద్రుడిపై ల్యాండింగ్‌కు సరిపడా ప్రాంతాలున్నాయని రష్యా పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story