Zealandia: ఇకపై ఖండాలు 7 కాదు 8..

Zealandia: ఇకపై ఖండాలు 7 కాదు 8..
8వ ఖండం గుర్తించిన శాస్త్రవేత్తలు.. పూర్తి వివరాలు ఇవీ!

భూగోళం మీద ఏడు ఖండాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. దీనిని ఆధారంగా చేసుకొనే దేశాలు అన్నింటినీ గుర్తిస్తాం. అయితే ఇప్పుడు అలాంటి మ్యాప్స్ లోనే మార్పు సంభంవించబోతోంది. ఇప్పుడు కొత్తగా మరో ఖండం తెర మీదికి వచ్చింది. తాజాగా ఈ ఖండాన్ని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేశారు. దాని విస్తీర్ణాన్ని వెల్లడించారు. కొత్త మ్యాప్‌ను విడుదల చేశారు. దీని పేరు జిలాండియా. 94 శాతం సముద్రంలో మునిగిపోయిన ఖండం ఇది. ఆరు శాతం భూభాగం మాత్రం న్యూజిలాండ్ పరిసరాల్లో విస్తరించి ఉంది. 375 సంవత్సరాల కిందటే దీన్ని కనుగొన్నప్పటికీ.. దీన్ని పూర్తిస్థాయిలో మ్యాపింగ్ చేయలేకపోయారు. సముద్రంలో మునిగిపోయి ఉండటం వల్ల అది సాధ్యపడలేదు.

జియోలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన ఓ పరిశోధన బృందం ‘జిలాండియా లేదా లె రియు-ఎ-మౌయి’ అని పిలువబడే ఖండం మ్యాపును రూపొందించారు. సముద్రం అడుగు భాగంలోని రాళ్ల నమూనాల డేటాను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న ఏడు ఖండాలకు తోడు కొత్తగా జిలాండియా వచ్చి చేరింది. దీంతో మొత్తం ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరే అవకాశం ఉంది. కొత్తగా కనుగొన్న ఈ కాంటినెంట్ ప్రపంచంలోనే చిన్న ఖండంగా పేరు సంపాదించుకుంది.


అతి ప్రాచీన ఖండం గోండ్వానాలో భాగమైన జిలాండియా కాలక్రమేణా వేరుపడినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఖండం మొత్తం విస్తీర్ణం 4.9 మిలియన్‌ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో మడగాస్కర్‌కు ఆరు రెట్లు ఉంటుంది. పసిఫిక్‌ మహా సముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ ఖండం సుమారుగా 94 శాతం నీటిలోనే ఉంది. మిగతా ప్రాంతం చిన్నచిన్న దీవులతో న్యూజిలాండ్‌ మాదిరిగా ఉంది.

నిజానికి డచ్‌ సెయిలర్‌ అబెల్‌ టాన్మాన్‌ 1642లో మొదటిసారిగా జిలాండియా గురించి ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఆయన సరైన ఆధారాలను సమర్పించలేకపోయారు. ఇంతకుముందు చేసిన 2021 అధ్యయనం జిలాండియా 1 బిలియన్ సంవత్సరాల వయస్సు అని సూచించింది, ఇది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు గతంలో అనుకున్న దానికంటే రెండింతలు పాతది. సుమారు 23 మిలియన్ సంవత్సరాల క్రితం నాటికి, భూభాగం పూర్తిగా మునిగిపోయి ఉండవచ్చు. ఇక ఇప్పుడు 375 ఏండ్ల తర్వాత జీఎన్‌ఎస్‌ పరిశోధకులు జిలాండియా ఉనికిని నిర్ధారించారు. ప్రస్తుతం సైంటిస్టులు సముద్రం అడుగుభాగంలోని రాళ్లు, అవక్షేప నమూనాలను స్టడీ చేస్తున్నారు. వీటిలో చాలా వరకు డ్రిల్లింగ్ నుంచి కొన్ని ద్వీపాల తీర ప్రాంతాల నుంచి సేకరించారు.

Tags

Read MoreRead Less
Next Story