New York: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం

New York: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం
నలుగురిని కాల్చిన దుండుగులు, ఒకరు మృతి

న్యూయార్క్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బ్రోంక్స్‌లో చోటు చేసుకుంది. దుండగులు స్కూటర్లపై వెళుతూ కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక సిగ్నల్ వద్ద రెండు స్కూటర్లపై వచ్చిన దుండగులు దాదాపు 10 షాట్లు కాల్చినట్లు అసిస్టెంట్ పోలీస్ చీఫ్ బెంజమిన్ గుర్లే వెల్లడించారు.

కాల్పుల ఘటనలో రోడ్డుపక్కన నిలబడిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తికి బుల్లెట్ ఛాతీలోకి వెళ్లడంతో మృతి చెందినట్లు గుర్లే చెప్పారు. కాల్పులకు పాల్పడినప్పుడు దుండుగులు ముసుగులు ధరించారని.. ఈ క్రమంలో వారిని గుర్తించడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. కాగా.. అనుమానం ఉన్న ఓ వ్యక్తిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి కాల్పుల్లో పాల్గొన్నాడా లేదా అన్నది పోలీసులకు తెలియదని గుర్లే చెప్పారు.

ముష్కరులు బాధితులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారా.. లేదా ఏదైనా ముఠాతో హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అసిస్టెంట్ పోలీస్ చీఫ్ చెప్పారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు బాధితుల పరిస్థితి సాధారణంగా ఉందని అన్నారు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 1 నుంచి బ్రాంక్స్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్ కమ్యూనిటీ రెస్పాన్స్ టీమ్ పనిచేస్తోందని, స్కూటర్లపై వచ్చే నేరగాళ్ల టార్గెట్ గా పని చేస్తోందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కాజ్ డాట్రీ తెలిపారు. బ్రోంక్స్‌లో అనుమానిత వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story