Japan: ఇకపై జపాన్‌లో అందరికీ ఒకే ఇంటిపేరు

Japan:  ఇకపై జపాన్‌లో అందరికీ ఒకే ఇంటిపేరు
విచిత్రమైన సమస్యలో జపాన్‌ జనాభా

భవిష్యత్తులో జపాన్‌ ఒక వింతైన సమస్యలో చిక్కుకోనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కఠినతర వివాహ చట్టాలు కొనసాగితే అందరికీ ఒకే ఇంటిపేరు వస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది. పెళ్లి చేసుకొన్న జంటలు వేర్వేరు ఇంటి పేర్లను ఉంచుకునే హక్కును ఇవ్వకపోతే.. 2531 నాటికి జపాన్‌ ప్రజల పేర్ల చివర ‘సాటో’ అనేది మిగులుతుందని ఆ నివేదికలో పేర్కొంది. జపాన్‌లో 18వ శతాబ్ధంలో చేసిన సివిల్‌ కోడ్‌ చట్టం ప్రకారం దంపతులు ఇద్దరూ ఒకే ఇంటి పేరు కలిగి ఉండాలి.

తొహొకు విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ హిరోషి యషోహిడా నేతృత్వంలో ఈ అధ్యయనం చేశారు. ఇప్పటికే ఆ దేశంలో 3,00,000 ఇంటి పేర్లు ఉన్నాయి. జనాభాలో అత్యధికంగా ‘సాటో’ అనేది 18,00,000 మంది పేర్ల పక్కన కనిపిస్తుంది. ఆ తర్వాత స్థానాల్లో సుజుకీ, తకాహాషి అనే ఉన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో దంపతులు వేర్వేరు ఇంటిపేర్లను పెట్టుకొనే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్లు మొదలయ్యాయి. లేకపోతే ‘సాటో’ మాత్రమే మిగులుతుంది.

ప్రస్తుతం జపాన్‌లో పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గింది. 2023లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వివాహాల్లో 6 శాతం తగ్గుదల కనిపించింది. దాదాపు 12 కోట్లకుపైగా జనాభా ఉన్న దేశంలో 5,00,000 కంటే తక్కువ పెళ్లిళ్లు జరిగాయి. గత 90 ఏళ్లలో ఇదే అత్యల్పం. విడాకుల రేటు మాత్రం ఇదే సమయంలో 2.6 శాతం పెరిగింది. ఈ పరిస్థితి మారితేనే తన అంచనాలు నిజమవుతాయని.. లేకపోతే వాటిల్లో తేడా రావొచ్చని హిరోషి అభిప్రాయపడ్డారు.

1980ల్లో ఆర్థిక వృద్ధి మొదలైన తర్వాత నుంచి జపాన్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు అది కేవలం 1.3శాతం మాత్రమే ఉంది. ప్రస్తుత జనాభా సంఖ్యనే భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే ఇది కనీసం 2.1శాతం ఉండాలి. గత పదేళ్లుగా ఈ దేశంలో మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story