Japan Earthquake: న్యూ ఇయర్ నాడు జపాన్‌ను వణికించిన భారీ భూకంపం,ఆరుగురి మృతి

Japan Earthquake: న్యూ ఇయర్ నాడు జపాన్‌ను వణికించిన భారీ భూకంపం,ఆరుగురి మృతి
155 సార్లు కంపించిన భూమి..

కొత్త సంవత్సరం రోజు సెంట్రల్ జపాన్‌ను అల్లాడించిన భారీ భూకంపం వల్ల ఆరుగురు మరణించారు. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో హౌన్షు భూకంపం వల్ల పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. సముద్రంలో ఒక మీటరు మేర అలలు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు, జపాన్ స్థానిక అధికారులు కూలిపోయిన భవనాల శిథిలాల నుంచి ఆరుగురి మృతదేహాలను బయటకు తీశారు. ఈ భారీ భూకంపం వల్ల పలు ఇళ్లు కూలిపోగా, పదివేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సోమవారం నుంచి ఇప్పటివరకు 155 సార్లు భూమి కంపించిందని జపాన్‌ వాతావరణ శాఖ (JMA) తెలిపింది. ఇందులో సోమవారం నాటి 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంతోపాటు 6 తీవ్రత నమోదైన భూకంపాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. అయితే 3 అంతకంటే ఎక్కువ తీవ్రతతో నమోదైనవే అత్యధికంగా ఉన్నాయని చెప్పింది. మంగళవారం తెల్లవారుజామున కూడా ఆరుసార్లు శక్తివంతమైన ప్రకంపణలు వచ్చాయని పేర్కొంది.


కాగా, సెంట్రల్‌ జపాన్‌లో సోమవారం నాటి భారీ భూకంపం వల్ల ఎనిమిది మంది మరణించారని అధికారులు తెలిపారు. సునామీ రావడంతో అలలు మీటరు ఎత్తు వరకు ఎగసిపడ్డాయని, దీంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. వాజిమా పట్టణంలో దాదాపు 30 భవనాలు కుప్పకూలాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో 32,700 మందికి పైగా నివాసితులు అంధకారంలోనే ఉండిపోయారని అధికారులు చెప్పారు. ఇషికావా తీరంలో అలలు విరుచుకుపడ్డాయి.

సునామీ హెచ్చరికల జారీతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు ఎతైన ప్రాంతాలకు తరలిపోయారు. జపాన్ పశ్చిమ సముద్ర తీరం, దక్షిణ కొరియాలో మీటరు మేర ఎత్తులో అలలు వచ్చాయి. భూకంపం కారణంగా రన్‌వేపై పగుళ్లు ఏర్పడటంతో స్థానిక విమానాశ్రయాన్ని మూసివేశారు. రెస్క్యూ కార్యకలాపాలకు ఆర్మీ సిబ్బందిని పంపారు. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని షికా టౌన్‌లో భవనం కూలిపోవడంతో వృద్ధుడు మరణించినట్లు స్థానిక పోలీసులు చెప్పారు.


రోడ్లు బ్లాక్ చేయడం వల్ల సహాయ సిబ్బంది భూకంపం సంభవించిన ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చెప్పారు. భూకంపం తర్వాత జపాన్‌కు అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో తొమ్మిది ప్రిఫెక్చర్లలో 97,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయమని జపాన్ ప్రభుత్వం ఆదేశించింది. వారంతా స్పోర్ట్స్ హాల్స్, పాఠశాల వ్యాయామశాలల్లో రాత్రి గడిపారు.

Tags

Read MoreRead Less
Next Story