South Korea: మనిషిని చంపిన రోబో

South Korea: మనిషిని చంపిన రోబో
రోబోను తనిఖీ చేస్తుండగా జరిగిన ఘటన

ప్రపంచంలో రోజు రోజుకూ యాంత్రీకరణ పెరిగిపోతోంది. మనుషుల పనులను, జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త కొత్త మెషీన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్నాలజీ భవిష్యత్‌లో ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరికలు చేసేవారు ఉన్నారు . ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇది భవిష్యత్ తరాల్లో మానవ మనుగడకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఇది మానవులకు మరింత సాయంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మానవాళికి ముప్పు వాటిల్లుతుందనే వాదనలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ వాదనలు ఎలా ఉన్నా టెక్నాలజీ ఒక్కోసారి ప్రాణాలు తీసే అవకాశం ఉంటుందనే దానికి దక్షిణ కొరియాలో జరిగిన ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఓ రోబో మనిషి ప్రాణాలను తీసేసింది. ఇండస్ట్రియల్ రోబో, తనను తనిఖీ చేయడానికి వచ్చిన వ్యక్తిని నలిపేసి చంపేసింది.

40 ఏళ్ల రోబోటిక్స్ కంపెనీ ఉద్యోగి, దక్షిణ జియోంగ్‌సాంగ్ ప్రావిన్సులోని వ్యవసాయ ఉత్పత్తులను పంపిణీ చేసే కేంద్రంలో రోబోట్ సెన్సార్ కార్యకలపాలను తనిఖీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బెల్ పెప్పర్‌తో నింపిన పెట్టెలను ఎత్తి ప్యాలెట్‌పై పెట్టే పనిని ఈ రోబో నిర్వహిస్తోంది. అయితే తనిఖీ చేస్తున్న సందర్భంలో ఇండస్ట్రియల్ రోబోట్ వ్యక్తిని పెట్టెగా భావించింది, దీంతో అతడిని నలిపేసినట్లుగా యోన్‌హాప్ పోలీసులు వెల్లడించారు. రోబోటిక్ చేయి వ్యక్తి పై భాగాన్ని కన్వేయర్ బెల్టుపై ఉంచి అతని ముఖాన్ని, ఛాతిని పచ్చడి చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎముకలు విరిగిపోయాయి. అది గమనించిన ఆ ఫ్యాక్టరీలోని మిగితా సిబ్బంది.. వెంటనే అక్కడికి చేరుకుని అతడ్ని పక్కకు లాగేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తిని పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని యోన్‌హాప్ పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఈ సంఘటన తీవ్ర సంచలనంగా మారింది.


Tags

Read MoreRead Less
Next Story