Chinese New Year: చైనాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

Chinese New Year: చైనాలో ఘనంగా నూతన సంవత్సర  వేడుకలు
లూనార్‌ క్యాలెండర్‌ ప్రకారం నూతన ఏడాది నిర్ణయం

చైనా ప్రజలందరూ నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. స్ప్రింగ్‌ ఫెస్టివల్‌గా పిలిచే ఈ వేడుకలు 16 రోజుల పాటు సాగనున్నాయి. స్ప్రింగ్‌ ఫెస్టివల్‌లో ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డ్రాగన్‌ వేషాలు ధరించిన ప్రజలు.....మిరుమిట్లు గొలిపే బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ప్రజలు భారీ స్థాయిలో డ్రాగన్‌ విగ్రహాలు తయారుచేసి ఆట, పాటలతో సంబరాల్లో పాల్గొన్నారు. నియాన్‌ అనే రాక్షసుడు బాణాసంచా కాల్చడం ద్వారా బెదిరి దూరంగా పోతాడని దాంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవిస్తారని చైనా ప్రజలు నమ్ముతారు. ఈ వేడుకల్లో ప్రజలు ఎక్కువగా ఎరుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఎరుపు రంగు చూసిన రాక్షసుడు తమకు దూరంగా పారిపోతాడని చైనా ప్రజల నమ్మకం. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 2024 డ్రోన్లతో రూపొందించిన.....డ్రాగన్‌, గ్లోబ్‌, జాతీయ పతాక నమూనాలు వీక్షకులను మంత్రముగ్దుల్ని చేశాయి.


చైనా ప్రజలకు అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్‌ నుంచి షెన్‌ఝూ-17 మిషన్‌కు చెందిన చైనా సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ దృఢంగా దేశాభివృద్ధి కోసం నిలబడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి తీసిన చైనాకు చెందిన భూభాగ దృశ్యాలను పంచుకున్నారు.

చైనీయులు నూతన సంవత్సర వేడుకలను స్థిరమైన తేదీన జరుపుకోరు. దీనికి కారణం వీరు గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ బదులుగా లూనార్‌ క్యాలెండర్‌ ప్రకారం నూతన ఏడాది తేదీని నిర్ణయిస్తారు. చైనాలో సాధారణంగా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో నూతన ఏడాది ప్రారంభమవుతుంది. ఇది చైనాలో వసంతకాల ప్రారంభాన్ని తెలియపరుస్తుంది. వీరి ప్రతీ సంవత్సరం ఒక రాశిచక్రాన్ని సూచిస్తుంది. ఇటువంటివి 12 రాశి చక్రాలు ఉన్నాయి. ప్రతి రాశిచక్రాన్ని ఒక జంతువు గుర్తుతో సూచిస్తారు. 2023లో కుందేలు, ఈ ఏడాదికి డ్రాగన్‌, 2025 సంవత్సరానికి పాము రాశి చిహ్నాలుగా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story