అంతర్జాతీయం

Sri lanka : మహింద రాజపక్స ప్రభుత్వంపై శ్రీలంక ప్రజల తిరుగుబాటు

Sri lanka : తీవ్ర ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో అల్లాడిపోతున్న శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి.

Sri lanka : మహింద రాజపక్స ప్రభుత్వంపై శ్రీలంక ప్రజల తిరుగుబాటు
X

Sri lanka : తీవ్ర ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో అల్లాడిపోతున్న శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి. చుక్కలంటున్న నిత్యావసర ధరలతో అర్థాకలితో అలమటిస్తున్న ప్రజల ఆగ్రహాలు కట్టల తెంచుకుంటోంది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. దేశ అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని మహింద రాజపక్సలు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ఉద్రిక్తంగా మారగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం అవుతున్న వేళ శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఇప్పటికే అధికార కూటమి నుంచి పలువురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రధాని మహింద రాజపక్సను తొలగించి ఆయన స్థానంలో మరోకరిని నియమించాలని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయించారు. ఇదే సమయంలో తన సోదరుడైన మహింద రాజపక్సను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలంటూ సూచించారు. అయితే తొలుత రాజీనామా చేసేందుకు ససేమిరా అన్న మహింద తర్వాత తప్పుకునేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స తప్పుకోవటం ఖాయంగా కనిపిస్తుంది.

మరోవైపు దేశంలో పరిస్థితులను చక్కబెట్టేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. నూతన ప్రధానిని ఎంపిక చేసేందుకు నేషనల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అఖిలపక్ష సభ్యులతో కూడిన కొత్త కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నారని స్పష్టంచేశారు. ఇప్పటికే మంత్రులుగా ఉన్న రాజపక్స కుటుంబసభ్యులు రాజీనామా చేశారు. ఇపుడు మహింద కూడా ప్రధాని పదవి వీడితే శ్రీలంక ప్రభుత్వంలో రాజపక్స కుటుంబంలో అధ్యక్షుడు గొటబాయ మినహా మొత్తం దూరమైనట్లే. మరి ప్రధాని, కేబినెట్ మార్పుతోనైనా శ్రీలంక పరిస్థితులు మారుతాయా అనేది చూడాలి.

Next Story

RELATED STORIES