Sweden: నాటో నూతన సభ్య దేశంగా స్వీడన్

Sweden: నాటో నూతన సభ్య దేశంగా స్వీడన్
దశాబ్దాల తటస్థతకు ముగింపు..

నాటో కూటమిలో 32వ సభ్యదేశంగా స్వీడన్‌ గురువారం అధికారికంగా చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో తన 200 ఏళ్ల తటస్థ వైఖరికి ముగింపు పలుకుతూ స్వీడన్‌ నాటోలో చేరింది. స్వీడన్‌ చేరిక వల్ల యునైటెడ్‌ స్టేట్స్‌, మిత్ర దేశాలు మరింత సురక్షితమయ్యాయని వైట్‌హౌస్‌ పేర్కొన్నది. గతేడాది నాటో కూటమిలో ఫిన్లాండ్‌ చేరిక తర్వాత ఇప్పుడు స్వీడన్‌ చేరింది. గత కొన్నేళ్లుగా నాటో సభ్య దేశాలైన టర్కీ, హంగేరిలు అభ్యంతరం తెలుపటంతో స్వీడన్‌ సభ్యత్వం నిలిపివేశారు.

తీవ్రవాదులుగా పరిగణించే కుర్దిష్‌ గ్రూపులకు స్వీడన్‌ ఆశ్రయం కల్పిస్తున్నదని టర్కీ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. మరోవైపు హంగేరి అధ్యక్షుడు విక్టర్‌ ఓర్బన్‌ ఇప్పటి దాకా రష్యా అనుకూల భావాన్ని ప్రదర్శిస్తూ.. ఉక్రెయిన్‌కు మద్దతునివ్వాలన్న కూటమి సంకల్పానికి విరుద్దంగా వ్యవహరించాడు. కొన్ని నెలల వ్యత్యాసంతో అటు టర్కీ, ఇటు హంగేరి రెండూ నాటో కూటమిలో స్వీడన్‌ ప్రవేశానికి ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా స్వీడన్‌ ప్రధాని మాట్లాడుతూ.. ఇది చారిత్రక దినమని, స్వేచ్ఛకు లభించిన విజయమని పేర్కొన్నారు.

ఈ పరిణామంపై రష్యా ఘాటుగా స్పందించింది. నాటో సేనలు స్వీడన్‌లో కాలు పెడితే తగు చర్యలు తప్పవని హెచ్చరించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలో నాటో కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే. అమెరికాతో సన్నిహిత సైనిక సంబంధాలు ఉన్నప్పటికీ స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాలు కొన్నేళ్లుగా తటస్థ వైఖరిని అనుసరిస్తూ నాటోకు దూరంగా ఉంటున్నాయి. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తరువాత రెండు దేశాల దౌత్యవ్యూహాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ఫిన్‌లాండ్ నాటోలో చేరగా తాజాగా స్వీడన్ కూడా ఆ కూటమి భాగస్వామి అయ్యింది. నాటోలో చేరేందుకు రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు తాజాగా కొలిక్కి రావడంతో స్వీడన్ కూడా నాటో సభ్యదేశంగా మారింది. దీంతో, రష్యా మినహా బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్న దేశాలన్నీ నాటోలో చేరాయి. దీంతో యుద్ధం సమయంలో రష్యాను అమెరికా మరింతగా ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు పెరిగాయి. ఇక 19వ శతాబ్దంలో నెపోలియన్ కాలం తరువాత స్వీడన్ ప్రపంచయుద్ధాలు సహా ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు.


Tags

Read MoreRead Less
Next Story