Taiwan: చైనా కవ్వింపు చర్యలకు చెక్ పెట్టనున్న తైవాన్

Taiwan: చైనా కవ్వింపు చర్యలకు చెక్ పెట్టనున్న  తైవాన్
డ్రిల్స్ నిర్వహిస్తున్న తైవాన్ ఆర్మీ

చైనా కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు తైవాన్ సమర సన్నాహాలు ఉద్ధృతం చేసింది. తమ సముద్రజలాల్లోకి చొచ్చుకువచ్చే డ్రాగన్ యుద్ధనౌకలు, తమ గగనతలంలోకి ప్రవేశించే జెట్‌ ఫైటర్లు తిప్పి పంపటమే లక్ష్యంగా విన్యాసాలు నిర్వహిస్తోంది. సముద్రం, ఆకాశమార్గాన చైనా నుంచి ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేలా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తైవాన్ ఆర్మీ తెలిపింది.

ద్వీపదేశం తమ అంతర్భాగమంటూ కవ్వింపుచర్యలకు దిగుతున్న చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు యుద్ధ సన్నద్ధత చర్యలను తైవాన్‌ ముమ్మరం చేసింది. ఇటీవల తైవాన్‌ను విలీనం చేసుకునే ప్రణాళికను డ్రాగన్‌ ఆవిష్కరించింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన తైవాన్...ఏ క్షణమైనా చైనా ఆకస్మికదాడులకు దిగే ప్రమాదం ఉందనే అంచనాలతో సమర సన్నాహాల్లో నిమగ్నమైంది. సముద్రం, ఆకాశమార్గాన దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తైవాన్ రెండురోజులపాటు సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాల్లో భారీగా యుద్ధట్యాంకులు, నౌకలు పాల్గొంటున్నాయి.


దాదాపు ప్రతిరోజూ చైనా యుద్ధనౌకలు, విమానాలు తమ సముద్ర జలాల్లోకి వస్తుంటాయని తైవాన్ ఆర్మీ అధికారులు ఆరోపిస్తున్నారు. గత 24 గంటల్లో 7 చైనా యుద్ధవిమానాలు, 4 యుద్ధ నౌకలు తైవాన్ సముద్ర జలాల్లోకి చొచ్చుకు వచ్చినట్లు చెప్పారు. డ్రాగన్ దేశం ఏ క్షణమైనా ఆకస్మిక దాడులకు తెగబడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో...డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టు తైవాన్ సైనికాధికారులు తెలిపారు. యుద్ధనౌకలు, బోట్లు, యుద్ధట్యాంకులు, ఇతర ఆయుధ వ్యవస్థలతో...తైవాన్‌ డ్రిల్స్ నిర్వహిస్తోంది.

తైవాన్‌ నూతన అధ్యక్షునిగా లాయ్‌ చింగ్‌ తె బాధ్యతలు చేపట్టిన 3వారాల్లోపే సైనిక విన్యాసాలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా సైనిక బలగాలు, ఆయుధ సంపత్తితో పోల్చుకుంటే తమ బలం తక్కువ కావటంతో ఆధునాతన ఆయుధాలపై తైవాన్ దృష్టి సారించింది. అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. దేశీయ ఆయుధ పరిశ్రమను పునరుద్ధరించింది. తప్పనిసరి సైనిక సేవ కాలవ్యవధిని 4నెలల నుంచి ఏడాదికి పొడిగించింది

Tags

Read MoreRead Less
Next Story